మాల్యా, నీర‌వ్ మోదీల అప్పగింత‌పై బ్రిట‌న్ మంత్రి కీల‌క వ్యాఖ్యలు..

by Disha Web Desk 13 |
మాల్యా, నీర‌వ్ మోదీల అప్పగింత‌పై బ్రిట‌న్ మంత్రి కీల‌క వ్యాఖ్యలు..
X

న్యూఢిల్లీ : బ్యాంకు రుణాలను ఎగ్గొట్టి బ్రిటన్‌లో తలదాచుకుంటున్న నీర‌వ్ మోదీ, విజ‌య్ మాల్యాలు త్వరలోనే దేశానికి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా బ్రిటన్ భ‌ద్రతా వ్యవ‌హారాల మంత్రి టామ్ తుగేన్‌ధాట్ చేసిన కామెంట్స్‌ను బట్టి ఆ దిశగా అడుగులు పడుతున్నట్టు కనిపిస్తోంది. ఆర్ధిక నేరాలకు పాల్పడి ఇతర దేశాల నుంచి పారిపోయి వచ్చే వారికి స్థావరంగా బ్రిటన్ మారబోదని టామ్ తుగేన్‌ధాట్ స్పష్టం చేశారు. "జీ20 దేశాల అవినీతి వ్యతిరేక గ్రూప్" స‌మావేశం కోసం భారత్‌కు వచ్చిన ఆయన ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్ చేశారు.

నిందితుల అప్పగింత వ్యవ‌హారంలో భార‌త్‌, బ్రిట‌న్ చ‌ట్టప‌ర‌మైన ప్రక్రియ‌ల‌కు క‌ట్టుబ‌డి ఉండాల‌ని.. నీర‌వ్ మోదీ, విజ‌య్ మాల్యాల పేర్లను ప్రస్తావించకుండానే వ్యాఖ్యానించారు. ఇక భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంక‌ర్‌, జాతీయ భద్రతా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్‌‌లతోనూ బ్రిట‌న్ మంత్రి టామ్ తుగేన్‌ధాట్ భేటీ అయ్యారు. విజయ్ మాల్యా దాదాపు రూ.9,000 కోట్ల బ్యాంకు రుణాలను ఎగవేసి 2016లో బ్రిటన్ పారిపోయారు. నీరవ్ మోదీ దాదాపు 2 బిలియన్ డాలర్ల పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో నిందితుడు. అతడు కూడా బ్రిటన్‌లోనే తలదాచుకుంటున్నాడు.


Next Story