పేటీఎం వ్యవహారంలో 'సమీక్షకు అవకాశం లేద'న్న ఆర్‌బీఐ గవర్నర్

by Dishanational1 |
పేటీఎం వ్యవహారంలో సమీక్షకు అవకాశం లేదన్న ఆర్‌బీఐ గవర్నర్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై ఆర్‌బీఐ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఎంపీసీ సమావేశంలో ఫిన్‌టెక్ కంపెనీలకు పలు సూచనలు చేసిన గవర్నర్ శక్తికాంత దాస్, తాజాగా పేటీఎం వ్యవహారంపై స్పందించారు. సోమవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన దాస్, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ విషయంపై 'సమీక్షకు అవకాశం లేదు' అని స్పష్టం చేశారు. 'పూర్తిస్థాయిలో అంచనాల తర్వాతే ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంటుంది. పేటీఎం విషయంపై ప్రశ్నావళిని సెంట్రల్ బ్యాంక్ ఈ వారంలో విడుదల చేస్తుందని' ఆయన పేర్కొన్నారు. 'ఫిన్‌టెక్ రంగానికి ఆర్‌బీఐ మద్దతిస్తోంది. ఇదే సమయంలో ఆర్థిక స్థిరత్వం, వినియోగదారుల ప్రయోజనాలను సంరక్షించే విషయంలో కట్టుబడి ఉన్నాం. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వ్యవహారంలో సమీక్షకు అవకాశం లేనట్టేనని' దాస్ వివరించారు. మరోవైపు, పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై ఆంక్షలకు సంబంధించి నివేదిక ఇవ్వాలని ఈడీ, ఫైనాన్షియల్ ఇంటిలిజెన్స్ యూనిట్‌లు ఆర్‌బీఐని కోరాయి. పేటీఎం సైతం ఆంక్షల నుంచి బయటపడాలని తీవ్ర ప్రయత్నాలను చేస్తోంది. ఫిబ్రవరి 29 తర్వాత నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఎలాంటి కస్టమర్, ప్రీపెయిడ్ ఇన్‌స్ట్రుమెంట్, వ్యాలెట్, ఫాస్టాగ్ డిపాజిట్లు, టాప్-అప్‌లు చేయకూడదని ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. నిబంధనల ఉల్లంఘన కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్‌బీఐ పేర్కొంది.


Next Story