'ఎలక్ట్రానిక్ విడిభాగాలపై దిగుమతి సుంకాలను తగ్గించొద్దు'

by Dishanational1 |
ఎలక్ట్రానిక్ విడిభాగాలపై దిగుమతి సుంకాలను తగ్గించొద్దు
X

దిశ, బిజినెస్ బ్యూరో: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే మధ్యంతర బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్ తయారీలో ఉపయోగించే ఎలక్ట్రానిక్ విడిభాగాలపై దిగుమతి సుంకాలను తగ్గించకూడదని ఆర్థిక మేధోసంస్థ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్(జీటీఆర్ఐ) తెలిపింది. ప్రస్తుతం ఉన్న పన్నుల కారణంగా పరిశ్రమ బాగుందని, వాటిలో మార్పులు చేయడం వల్ల స్థానిక తయారీని దెబ్బతీయవచ్చని సోమవారం నివేదికలో (జీటీఆర్ఐ) పేర్కొంది. ప్రస్తుత రేట్లనే కొనసాగించడం వల్ల దేశంలో పెరుగుతున్న స్మార్ట్‌ఫోన్ మార్కెట్ వృద్ధి, దీర్ఘకాలిక అభివృద్ధిని సమతుల్యం చేయవచ్చని అభిప్రాయపడింది. దేశంలో స్మార్ట్‌ఫోన్ తయారీకి దిగుమతి చేసుకునే విడిభాగాలపై 7.5 శాతం నుంచి 10 శాతం మధ్య పన్నులు ఉన్నాయి. రానున్న బడ్జెట్‌లో ఈ పన్నులనే కొనసాగించాలి. ముఖ్యంగా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ల తయారీకి వాడే విడిభాగాలపై ఈ సుంకాలను తగ్గించకూడదని జీటీఆర్ఐ పేర్కొంది. జీటీఆర్ఐ నివేదిక ప్రకారం, భారత స్మార్ట్‌ఫోన్ పరిశ్రమ 2022లో సుమారు రూ. 60 వేల కోట్ల నుంచి 2023లో రూ. 1.15 లక్షల కోట్లకు చేరింది.


Next Story