పాలసీ వ్యూహాల్లో మార్పులు చేయాలని ఎల్ఐసీని సూచించిన ప్రభుత్వం!

by Disha Web Desk 17 |
పాలసీ వ్యూహాల్లో మార్పులు చేయాలని ఎల్ఐసీని సూచించిన ప్రభుత్వం!
X

న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసీ తన వృద్ధి సామర్థ్యాన్ని గ్రహించి, పెట్టుబడిదారులకు మెరుగైన రాబడులను అందించడంలో సహాయపడేందుకు ప్రయత్నించాలని ప్రభుత్వం వెల్లడించింది. ఈ క్రమంలోనే వాటాదారులకు మెరుగైన రాబడి ఇచ్చేందుకు పాలసీ వ్యూహాల్లో మార్పులు చేయాలని ప్రభుత్వం సూచించింది.

ముఖ్యంగా టర్మ్ ప్లాన్లతో పాటు నాన్-పార్టిసిపేటింగ్ ప్రోడక్టులపై దృష్టి సారించాలని, తద్వారా సంస్థ లాభదాయకతను పెంచాలని ఎల్ఐసీని సూచించింది. ఎల్ఐసీ సంస్థ భారత స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయినప్పటి నుంచి షేర్ విలువ భారీగా క్షీణించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం వృద్ధితో పాటు ఇన్వెస్టర్లకు లాభాలను తెచ్చిపెట్టేలా తగిన పాలసీ వ్యూహాలను అనుసరించాలని తెలిపింది.

స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ ద్వారా ఎల్ఐసీ ఆధునీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఇదే సమయంలో పాలసీ, ఇతర ప్లాన్‌లలో కూడా అందుకు అనుగుణంగా మార్పులు చేసేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కొత్త జనరేషన్ నుంచి ఎక్కువగా టర్మ్ ప్లాన్‌ల కోసం అభ్యర్థనలు వస్తున్నాయి. ఈ తరుణంలో సంస్థ సామర్థ్యాన్ని వినియోగించి కొత్త వ్యూహాలను అమలు చేయాల్సి ఉందని సంబంధిత అధికారి ఒకరు పేర్కొన్నారు.

కాగా, ఎల్ఐసీ సంస్థ ఈ ఏడాది మే నెలలో స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయింది. ఇష్యూ ధర రూ. 949 తో పోలిస్తే 8 శాతం నష్టంతో రూ. 872 వద్ద లిస్ట్ అయిన తర్వాత ఏ దశలోనూ కోలుకోలేదు. అనేక పరిణామాల కారణంగా 30 శాతానికి పైగా నష్టంతో ప్రస్తుతం రూ. 596.20 వద్ద ఉంది.



Next Story

Most Viewed