టెక్ కంపెనీల్లో మళ్లీ తొలగింపులు షురూ

by Dishanational1 |
టెక్ కంపెనీల్లో మళ్లీ తొలగింపులు షురూ
X

దిశ, బిజినెస్ బ్యూరో: టెక్ కంపెనీలు ఇప్పటికీ ఆర్థిక మందగమనం నుంచి బయటపడినట్టు కనిపించడంలేదు. గతేడాది తొలగింపుల ధోరణిని 2024లోనూ కొనసాగిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ లేఆఫ్స్‌ను ప్రకటించగా, తాజాగా టెక్ దిగ్గజం గూగుల్ సైతం భారీగా తొలగింపులను ప్రకటించింది. కంపెనీ పునర్‌వ్యవస్థీకరణ, వ్యయ నియంత్రణలో భాగంగా ఏఐ విభాగంలో వందలాది మందిని ఇంటికి సాగనంపే ప్రక్రియను ప్రారంభించింది. ముఖ్యంగా హార్డ్‌వేర్, డిజిటల్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ విభాగాల్లో ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నట్టు గూగుల్ స్పష్టం చేసింది. వాయిస్ ఆధారిత గూగుల్ అసిస్టెంట్, ఆగ్మెంటెడ్ రియాలిటీ హార్డ్‌వేర్ విభాగాల్లో పనిచేసే సిబ్బందితో సహా ఇతరులపై ప్రభావం ఉంటుందని ఓ ప్రకటనలో పేర్కొంది. ఇవికాకుండా కంపెనీ సెంట్రల్ ఇంజనీరింగ్ విభాగంలోనూ తొలగింపులు ఉండొచ్చని సంకేతాలిచ్చింది. మరోవైపు గూగుల్‌కు చెందిన ఫిట్‌బిట్ సహ-వ్యవస్థాపకులు జేమ్స్ పార్క్, ఎరిక్ ఫ్రైడ్‌మన్, ఇతర కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు తమ పదవులకు రాజీనామా చేయడం పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీసింది. వీరి రాజీనామాల తర్వాతే గూగుల్ పెద్ద సంఖ్యలో లేఆఫ్స్ నిర్ణయం తీసుకుంది.


Next Story