జర్మనీలో మాంద్యంతో మొత్తం యూరప్ ఎగుమతులపై ప్రభావం!

by Dishaweb |
జర్మనీలో మాంద్యంతో మొత్తం యూరప్ ఎగుమతులపై ప్రభావం!
X

న్యూఢిల్లీ: జర్మనీలో ఆర్థిక మాంద్యం కారణంగా భారత్‌లోని కెమికల్స్, యంత్రాలు, దుస్తులు, ఎలక్ట్రానిక్స్ వంటి వివిధ రంగాల నుంచి యూరప్‌కు ఎగుమతులపై ప్రభావం పడుతుందని సీఐఐ ఎక్జిమ్ కమిటీ ఛైర్మన్ సంజయ్ బుధియా అన్నారు. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థికవ్యవస్థ అయిన జర్మనీ వృద్ధి రేటు గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో 0.5 శాతం క్షీణించింది. అంతకుముందు త్రైమాసికంలోనూ 0.3 శాతం పడిపోవడంతో మాంద్యం పరిస్థితులను ఎదుర్కొంటోంది. 2022లో భారత మొత్తం ఎగుమతుల్లో జర్మనీ 4.4 శాతం వాటాను కలిగి ఉంది. అందులో అత్యధికంగా సేంద్రీయ రసాయనాలు, యంత్రాలు, ఎలక్ట్రానిక్స్, దుస్తులు, పాదరక్షలు, ఇనుము, ఉక్కు, తోలు ఉత్పత్తులున్నాయి. ప్రస్తుతం జర్మనీలో మాంద్యం కారణంగా వీటి ఎగుమతులు తీవ్రగా దెబ్బతింటాయని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంజయ్ బుధియా వెల్లడించారు. అంతేకాకుండా మరోవైపు జర్మనీ మాంద్యంతో మొత్తం యూరప్‌కు జరిగే ఎగుమతుపైనే ప్రభావం పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. భారత ఎగుమతుల్లో యూరప్ వాటా 14 శాతం ఉంది. అందులో జర్మనీ అగ్రస్థానంలో ఉండగా, నెదర్లాండ్స్, బెల్జియం, ఇటలీ, ఫ్రాన్స్ తర్వాతి స్థానంలో ఉన్నాయి.

Next Story

Most Viewed