భారత హెల్త్‌కేర్ సిస్టమ్‌ను మార్చేయనున్న జెన్ ఏఐ: పీడబ్ల్యూసీ ఇండియా

by Dishanational1 |
భారత హెల్త్‌కేర్ సిస్టమ్‌ను మార్చేయనున్న జెన్ ఏఐ: పీడబ్ల్యూసీ ఇండియా
X

దిశ, బిజినెస్ బ్యూరో: రోగులకు చికిత్స అందించే సమయంలో వైద్యులకు మరింత సామర్థ్యాన్ని అందించడం ద్వారా జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(జెన్ ఏఐ) భారత హెల్త్‌కేర్ సిస్టమ్‌ను పూర్తిగా మార్చగలదని ఓ నివేదిక తెలిపింది. 'భారత ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై జెన్ ఏఐ ప్రభావం' పేరుతో పీడబ్ల్యూసీ ఇండియా రూపొందించిన నివేదిక ప్రకారం, మిగిలిన రంగాలతో పోలిస్తే ఆరోగ్య రంగంలో జెన్ ఏఐ అధునాతన విశ్లేషణలు, రోగులకు సంబంధించి టెస్టింగ్ ఫలితాలు, సత్వర క్లినికల్ సిఫార్సులు వంటి పనులను సులభతరం చేస్తుంది. ఇప్పటికే ఈ-కామర్స్, రిటైల్, తయారీ రంగాల్లో జెన్ ఏఐ ఉన్నప్పటికీ, హెల్త్‌కేర్‌లో ఎక్కువ వేగంగా వినియోగం జరుగుతోంది. రోగ నిర్ధారణ, టెస్టింగ్‌ల విషయంలో లభించే ఖచ్చితమైన ఫలితాలు, క్లినికల్ సపోర్ట్ వంటి అంశాలు భవిష్యత్తులో జెన్ ఏఐ హెల్త్‌కేర్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు, పురోగతిని తీసుకొస్తుందని, దీనివల్ల రోగుల సంరక్షణను మెరుగుపరచడానికి వీలవుతుందని నివేదిక పేర్కొంది. ఇదే సమయంలో డేటా భద్రత, ఏఐ వినియోగం తప్పుదారి పట్టకుండా చూసుకోవాల్సిన క్లిష్టమైన సమస్యల గురించి కూడా నివేదిక ప్రస్తావించింది. ఆయా రిస్క్‌లను నివారించేందుకు సమగ్రమైన ఫ్రేమ్‌వర్క్ అవసరమని పీడబ్ల్యూసీ ఇండియా అడ్వైజరీ లీడర్ అర్నాబ్ బసు అభిప్రాయపడ్డారు. 2021 నుంచి 2023 మధ్య కాలంలో దేశీయంగా జెన్ ఏఐ స్టార్టప్‌ల సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగింది. ప్రస్తుతం ఈ మార్కెట్ వార్షిక వృద్ధి రేటు 27.66 శాతంగా ఉందని, 2030 నాటికి ఇది రూ. 35,000 కోట్లను అధిగమిస్తుందని నివేదిక అంచనా వేసింది.

Next Story