పాన్-ఆధార్ అనుసంధానంపై జరిమానాను సమర్థించిన ఆర్థిక మంత్రి!

by Disha Web Desk 17 |
పాన్-ఆధార్ అనుసంధానంపై జరిమానాను సమర్థించిన ఆర్థిక మంత్రి!
X

న్యూఢిల్లీ: శాశ్వత ఖాతా సంఖ్య(పాన్)ను ఆధార్‌తో అనుసంధానం చేయడంలో ఆలస్యంపై విధిస్తున్న జరిమానాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్థించారు. ఈ ఏడాది మార్చితో పాన్-ఆధార్ లింక్ చేసేందుకు గడువు పూర్తవగా, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) జూన్ 30 వరకు గడువును పొడిగించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి 2022, మార్చి 31 నాటికే గడువు ముగిసినప్పటికీ, రూ. 500 జరిమానాతో పాన్-ఆధార్ అనుసంధాన ప్రక్రియను పొడిగిస్తూ వచ్చారు. తాజాగా ఏప్రిల్ 1 నుంచి జరిమానా మొత్తాన్ని రూ. 1,000కి పెంచారు.

ఈ క్రమంలోనే గురువారం ఆర్థిక మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పాన్-ఆధార్ అనుసంధానం కోసం ఇప్పటికే అనేకసార్లు గడువు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఈ ప్రక్రియ పూర్తవ్వాల్సిందని అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు పాన్-ఆధార్ లింక్ చేయని వారు పూర్తి చేయాలని సూచించారు. కాగా, నిర్దేశించిన గడువులోగా అనుసంధానం చేయకపోతే పాన్ కార్డు పనిచేయదని సీబీడీటీ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. దానివల్ల రిటర్న్స్, రీఫండ్స్‌కు అవకాశం ఉండదని పేర్కొంది.

కాగా, గురువారం ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ తీసుకున్న నిర్ణయంపై ఆర్థిక మంత్రి స్పందించారు. ఆర్‌బీఐ సరైన నిర్ణయం తీసుకుందని భావిస్తున్నట్టు చెప్పారు. ద్రవ్యోల్బణాన్ని అనుకున్న లక్ష్యం 6 శాతం లేదా అంతకంటే తక్కువకే ఉంచాలని, తాజా ఆర్‌బీఐ చర్య సానుకూల సంకేతాలనిస్తోందని ఆమె వెల్లడించారు.

Read more:

పోస్టాఫీసులో అదిరిపోయే స్కీం: రోజుకు రూ. 95 పెట్టుబడితో చేతికి రూ. 14 లక్షలు


Next Story