ChatGPT తో భారీ ఉపద్రవం..? 30 కోట్ల మందికి ముప్పు!

by Disha Web Desk 17 |
ChatGPT తో భారీ ఉపద్రవం..? 30 కోట్ల మందికి ముప్పు!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ఎక్కడ చూసిన ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ChatGPT గురించి చర్చ నడుస్తోంది. దీని గురించి కొంత మంది సంతోషం వ్యక్తం చేస్తుంటే మరికొంత ఆందోళన చెందుతున్నారు. ఈ ఆందోళనకు కారణం కూడా ఉంది. AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారంగా నడిచే ఈ యాప్ ప్రజలకు చాలా రకాలుగా సేవలు అందిస్తుంది. 2022 లో ప్రారంభమైన ఈ యాప్ తొందరగానే కొన్ని కోట్ల మంది వినియోగదారులకు చేరువ అయింది. దీనికి కారణం మానవ సహయం లేకుండా దీని ద్వారా కవిత్వాలు, వ్యాసాలు, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌కు కోడింగ్, కంటెంట్ రాయడం మొదలగు పనులు చేయించుకోవచ్చు. దీంతో ఈ రంగాల్లో మానవుల ఉద్యోగాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు ఊడుతున్న తరుణంలో, ఇప్పుడు ఈ టెక్నాలజీ కారణంగా 30 కోట్ల మంది తమ ఉద్యోగాలను పొగొట్టుకునే అవకాశం ఉందని గోల్డ్‌మన్ సాచ్స్ ఇటీవల నివేదిక పేర్కొంది. వివిధ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించి ఈ AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సహయంతో కంపెనీలు తమ పనిని పూర్తి చేసుకుంటాయని, దీని కారణంగా భారీగా ఉద్యోగాల కోత ఉంటుందని, ఒకానొక దశలో ఇది ఉద్యోగులకు ఉపద్రవం లాగా ఉంటుందని, ప్రస్తుతం ఉన్న అనేక పనులకు ఏఐ ప్రత్యామ్నాయంగా మారనుందని నివేదిక తెలిపింది. ChatGPT మాతృ సంస్థ OpenAI CEO సామ్ ఆల్ట్‌మాన్ కూడా ఇదే అభిప్రాయాన్ని తెలిపారు. ఆటోమెటిక్‌గా పనిచేసే సాంకేతికత ప్రజలకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది, కానీ ఇది కొన్ని రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఒక ముప్పులా వాటిల్లుతుందని అన్నారు.


ఇటీవల న్యూయార్క్‌లోని కొన్ని పాఠశాలల్లో ఈ యాప్ వాడకాన్ని నిషేధించారు. దీనికి కారణం అక్కడి పాఠశాలలో విద్యార్థులు తమ అసైన్‌మెంట్‌లను వ్రాయడానికి దీనిని ఉపయోగించారు. దీంతో విద్యార్థులు తమ సొంత ప్రయోజనాలను కూడా కోల్పోతున్నారు. విద్యార్థులే కాకుండా ఉపాధ్యాయులు కూడా చాట్‌బాట్‌పై ఆధారపడుతున్నట్లు సమాచారం. వివిధ కంపెనీలు కూడా తమ అప్లికేషన్లలో కోడింగ్ రాయడానికి, ఆఫీస్, అడ్మినిస్ట్రేటివ్ తదితర విభాగాల్లో, సాఫ్ట్‌వేర్ రంగాల్లో దీనిని ఉపయోగిస్తున్నాయి.


దీంతో కంటెంట్ క్రియేషన్, అడ్వర్టైజింగ్, జర్నలిజం, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌, సాఫ్ట్‌వేర్ కోడింగ్ తదితర ఆయా రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు భారీ ఎఫెక్ట్ ఉండనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు, మీడియా రంగాల్లో పనిచేసే కంటెంట్ రైటర్లు, స్పోర్ట్స్, ఫైనాన్స్, రంగాల విశ్లేషకులు, రీసెర్చ్ అనలిస్ట్‌లు, జర్నలిస్టులు, అడ్వైజర్లు, అప్లికేషన్ క్రియేటర్లు లాంటి తదితరులు తమ ఉద్యోగాలను పోగొట్టుకునే అవకాశం ఉందని నివేదిక తెలిపింది.





Next Story

Most Viewed