నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!

by Disha Web Desk 13 |
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాలను ఎదుర్కొన్నాయి. గత నాలుగు వారాలుగా జీవితకాల గరిష్ఠాల వద్ద కొనసాగుతున్న మార్కెట్ల ర్యాలీ సోమవారం ట్రేడింగ్‌లో వరుసగా రెండో సెషన్‌లో బలహీనపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి పెద్దగా సానుకూల సంకేతాలు రావడంతో పాటు అమెరికా ఫెడ్ కీలక వడ్డీ రేట్లపై ఈ వారం నిర్ణయం తీసుకోనుండటంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. ఇదే సమయంలో దేశీయంగా దిగ్గజ రిలయన్స్, ఐటీసీ కంపెనీల షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనబడింది. ప్రధానంగా వరుస రికార్డు స్థాయిల వద్ద ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం, ఈ వారంలో ఎఫ్అండ్ఓ గడువు ముగియనుండటం వంటి పరిణామాలు మార్కెట్లను ప్రభావితం చేశాయి.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 299.48 పాయింట్లు క్షీణించి 66,384 వద్ద, నిఫ్టీ 72.65 పాయింట్లు నష్టపోయి 19,672 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఫార్మా, హెల్త్‌కేర్, ఆటో, పీఎస్‌యూ బ్యాంక్ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఇండస్ఇండ్ బ్యాంక్, ఎంఅండ్ఎం, పవర్‌గ్రిడ్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఆల్ట్రా సిమెంట్, ఎల్అండ్‌టీ కంపెనీల షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. ఐటీసీ, కోటక్ బ్యాంక్, టెక్ మహీంద్రా, జేఎస్‌డబ్ల్యూ, టాటా స్టీల్, హిందూస్తాన్ యూనిలీవర్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 81.83 వద్ద ఉంది.


Next Story