మళ్లీ అందుబాటులోకి రానున్న 'బ్యాటిల్‌గ్రౌండ్' గేమింగ్ యాప్!

by Disha Web Desk 17 |
మళ్లీ అందుబాటులోకి రానున్న బ్యాటిల్‌గ్రౌండ్ గేమింగ్ యాప్!
X

న్యూఢిల్లీ: ప్రముఖ ఆన్‌లైన్ గేమింగ్ యాప్ బ్యాటిల్‌గ్రౌండ్ మొబైల్ ఇండియా 3 నెలల ట్రయల్ పీరియడ్‌కు ప్రభుత్వ నిషేధం ఉపసంహరించుకున్న నేపథ్యంలో దేశీయంగా కార్యకలాపాలను తిరిగి ప్రారంభించనుంది. భద్రతా సమస్యల కారణంగా గతేడాది జులైలో కేంద్రం ఈ యాప్‌‌ను నిషేధించిన సంగతి తెలిసిందే.

బ్యాటిల్‌గ్రౌండ్ మొబైల్ ఇండియా మాతృసంస్థ దక్షిణ కొరియా గేమింగ్ కంపెనీ క్రాఫ్టన్ త్వరలో గేమ్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. డెవలపర్లు, భారత అధికారుల మధ్య జరిగిన చర్చల అనంతరం, కొద్ది రోజుల తర్వాత గేమ్ తిరిగి అందుబాటులోకి వస్తుందని క్రాఫ్టన్ ధృవీకరించింది. అయితే, ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటుందనే తేదీ వివరాలను కంపెనీ వెల్లడించలేదు.

గత కొన్ని నెలలుగా తమకు మద్దతుగా నిలిచిన భారత గేమింగ్ వినియోగదారులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని క్రాఫ్టన్ ఇంక్ ఇండియా సీఈఓ షాన్ హ్యూనిల్ సోహ్న్ అన్నారు. దేశీయ గేమింగ్ వ్యాపారంలో పెట్టుబడులకు తాము కట్టుబడి ఉన్నాము. వృద్ధి, కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించే అవకాశాలకు సహకరిస్తాం. దేశంలో మెరుగైన నైపుణ్యం, ఉపాధి అవకాశాలను అందించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన వివరించారు.

కాగా, పబ్‌జీ ఇండియన్‌ వెర్షన్‌గా వచ్చిన బ్యాటిల్‌ గ్రౌండ్‌ మొబైల్‌ ఇండియా యూజర్ల డేటాకు సంబంధించి క్రాఫ్టన్‌ సంస్థ డేటాను చైనాలోని సర్వర్‌తోపాటు మరికొన్నింటికి పంపుతోందనే ఆరోపణలను ఎదుర్కొంది. దాంతో గతేడాది జూన్‌లో కేంద్రం యాప్ స్టోర్ల నుంచి బ్యాటిల్‌గ్రౌండ్ యాప్‌ను తొలగించింది.


Next Story