పెరగనున్న బ్యాంక్ ఆఫ్ బరోడా రుణాలు!

by Disha Web Desk 17 |
పెరగనున్న బ్యాంక్ ఆఫ్ బరోడా రుణాలు!
X

ముంబై: ప్రభుత్వ రంగ రెండో అతిపెద్ద బ్యాంక్ ఆఫ్ బరోడా గృహ రుణాల వడ్డీ రేట్లు ప్రియం కానున్నాయి. ఇటీవల ద్రవ్య పరపతి విధాన సమావేశంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) కీలక రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచిన నేపథ్యంలో బ్యాంకులు క్రమంగా వడ్డీ రేట్లను సవరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ బరోడా గురువారం(ఫిబ్రవరి 9) నుంచి అమల్లోకి వచ్చేలా బ్యాంక్ రెపో లింక్‌డ్ లెండింగ్ రేటు(బీఆర్ఎల్ఎల్ఆర్)ను పెంచింది.

బ్యాంకు అధికారిక వెబ్‌సైట్ వివరాల ప్రకారం, వినియోగదారులు తీసుకునే రిటైల్ రుణాలపై ప్రభావితమయ్యే బీఆర్ఎల్ఎల్ఆర్ 9.10 శాతానికి చేర్చింది. బ్యాంకు బేస్ రేటు ఏడాది కాలవ్యవధిపై 9.15 శాతానికి చేరుకోగా, ఇప్పటికే ఉన్న ఖాతాలకు బీపీఎల్ఆర్ ఏడాది కాలవ్యవధిపై 13.45 శాతంగా ఉంది. రుణ మొత్తం, వినియోగదారుల సిబిల్ స్కోర్ ఆధారంగా వడ్డీరేట్ల ప్రభావం మారుతుంది.

బ్యాంకు తాజా సవరణల ప్రకారం, ఎంసీఎల్ఆర్ ఓవర్‌నైట్ కాలానికి 7.50 శాతం నుంచి 7.85 శాతానికి పెరిగింది. వినియోగదారులు తీసుకునే రుణాలపై ప్రభావం చూపే ఏడాది కాలవ్యవధి ఎంసీఎల్ఆర్‌పై వడ్డీ రేటు 8.30 శాతం నుంచి 8.50 శాతానికి చేరుకుంది.


Next Story