పూర్తిగా ఈవీలపై వాహన తయారీ కంపెనీల ఫోకస్

by Dishanational1 |
పూర్తిగా ఈవీలపై వాహన తయారీ కంపెనీల ఫోకస్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో ఈవీల తయారీని ప్రోత్సహించేందుకు ఇటీవల కేంద్రం ఈ-వెహికల్‌ పాలసీని తీసుకొచ్చింది. ఈ పాలసీ ద్వారా దేశీయంగా కొత్త సాంకేతికత అందుబాటులోకి రావడంతో పాటు మేక్-ఇన్-ఇండియాకు ఊతమవుతుందని కేంద్రం తెలిపింది. ఇదే సమయంలో పర్యావరణానికి మేలుతో పాటు క్రూడాయిల్‌ దిగుమతులు తగ్గించవచ్చని పేర్కొంది. కొత్త పాలసీతో పర్యావరణ అనుకూల పరిష్కారాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుండటంతో భారతీయ ఆటో పరిశ్రమ రానున్న సంవత్సరాల్లో పదుల సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) మోడళ్లను విడుదల చేయనున్నాయి. మారుతీ సుజుకి, హ్యూండాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ లాంటి మాస్ మార్కెట్ కంపెనీలు ఈవీ సెగ్మెంట్‌లో డిమాండ్‌ను తీర్చేందుకు కొత్త మోడళ్లను క్యూలో ఉంచుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి నుంచి ఐదు కొత్త ఈవీ కార్లను విడుదల చేయనున్నట్టు ఎంఅండ్ఎం సీఈఓ నళినీకాంత్ గొల్లగుంట చెప్పారు. 'ఈ ఈవీ ఎస్‌యూవీలను ఎంఅండ్ఎం ఇంగ్లో ప్లాట్‌ఫామ్‌పై రూపొందిస్తోంది. భవిష్యత్తులో 2027 నాటికి కంపెనీ పోర్ట్‌ఫోలియోలో 20-30 శాతం ఈవీలను కలిగి ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు' నళీనీకాంత్ తెలిపారు.

ప్యాసింజర్ వాహన దిగ్గజ మారుతీ సుజుకి సైతం ఈవీ విభాగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. ఈ ఏప్రిల్ నుంచి మొదలయ్యే 2024-25 ఆర్థిక సంవత్సరంలో 550 కిలోమీటర్ల పరిధి కలిగిన ఈవీ మోడల్ ఉత్పత్తిని ప్రారంభిస్తున్నామని కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాహుల్ భారతీ చెప్పారు. వచ్చే 7-8 ఏళ్లలో దాదాపు ఆరు ఈవీ మోడళ్లను తీసుకొస్తామని ఆయన పేర్కొన్నారు. కర్బన, చమురు దిగుమతులను తగ్గించేందుకు దేశంలో హైబ్రిడ్-ఎలెక్ట్రిక్, సీఎన్‌జీ, బయో-సీఎన్‌జీ, ఇథనాల్ ఫ్లెక్స్ ఇంధనం వంటి టెక్నాలజీ వాహనాలు అవసరమని ఆయన వివరించారు. హ్యూండాయ్ మోటార్ ఇండియా సీఓఓ తరుణ్ గార్గ్ సైతం, తాము అన్ని టెక్నాలజీ వాహనాలపై పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఇప్పటికే ఈవీ ఎస్‌యూవీ మోడల్ కోనాను, ప్రీమియం ఈవీ ఎస్‌యూవీ అయొనిక్ 5ను మార్కెట్లో విడుదల చేసిన హ్యూండాయ్, 2030 నాటికి దేశీయ ఆటో మార్కెట్లో 20 శాతం ఈవీలు ఉంటాయని అంచనా వేస్తోంది. వచ్చే 10 ఏళ్లలో రూ. 26,000 కోట్ల పెట్టుబడులకు కంపెనీ సిద్ధంగా ఉంది. ఇందులో బ్యాటరీ అసెంబ్లీ ప్లాంట్ ఏర్పాటు కూడా ఉంటుందని తరుణ్ గార్గ్ తెలిపారు.

ప్రస్తుతం ఈవీ సెగ్మెంట్‌లో ఆధిపత్యం కలిగిన టాటా మోటార్స్ కూడా 2026 నాటికి కొత్తగా 10 ఎలక్ట్రిక్ మోడళ్లను తీసుకొచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. కర్వ్ ఈవీ, హ్యారియర్ ఈవీతో సహా ఈ ఏడాదిలోనే మరో నాలుగు ఈవీ మోడళ్ల విడుదలకు కంపెనీ యోచిస్తోంది. ఇప్పటికే ఈ విభాగంలో అధిక మార్కెట్ వాటా కలిగిన ఉన్న కంపెనీ, భవిష్యత్తులో లగ్జరీ ఈవీలపై దృష్టి సారించాలని చూస్తోంది. ఇక, లగ్జరీ బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్ ఇండియా సైతం 2024లోనే 12 కంటే ఎక్కువ కొత్త మోడళ్లను తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. వీటిలో మూడు ఈవీలే ఉంటాయని కంపెనీ ప్రతినిధి తెలిపారు.


Next Story

Most Viewed