మీషోకు పోటీగా అమెజాన్ కొత్త ప్లాట్‌ఫామ్

by Dishanational1 |
మీషోకు పోటీగా అమెజాన్ కొత్త ప్లాట్‌ఫామ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కొత్త ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించనుంది. ముఖ్యంగా తక్కువ ధరలో నాన్-బ్రాండెడ్ లైఫ్‌స్టైల్, ఫ్యాషన్ ఉత్పత్తులను అందులో విక్రయించనుంది. విలువ ఆధారిత మార్కెట్ అయిన భారత్‌లో వినియోగదారులకు మరింత చేరువ కావడానికి, ఇటీవల వేగంగా అభివృద్ధి చెందుతున్న మీషో, షాప్సీ వంటి ప్లాట్‌ఫామ్‌లకు గట్టి పోటీ ఇచ్చేందుకు అమెజాన్ ప్రయత్నిస్తోంది. 'అమెజాన్ బజార్ ' పేరుతో తీసుకురానున్న కొత్త ప్లాట్‌ఫామ్‌లో రూ. 600 కంటే తక్కువ ఖరీదైన దుస్తులు, బూట్లు, ఆభరణాలు, ఇతర బ్రాండెడ్ కాని వస్తువులను అమ్మకానికి ఉంచనుంది. దీనికి సంబంధించి టీవల అమెజాన్ అమ్మకందారులకు ఒక లేఖను కూడా పంపినట్టు తెలుస్తోంది. 'బజార్ అనే అమెజాన్‌లోని కొత్త స్టోర్‌లో మీ ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ ఉత్పత్తులను ఎటువంటి ఛార్జీలు లేకుండా ఆన్‌లైన్‌లో విక్రయించవచ్చు. తద్వారా మీ వ్యాపారాన్ని మరింత లాభదాయకంగా నిర్వహించుకోవచ్చని ' అమెజాన్ లేఖలో పేర్కొంది. అలాగే, బజార్‌లో కొనుగోలు చేసిన ఉత్పత్తులను రెండు లేదా మూడు రోజుల్లో డెలివరీ అందించే టైమ్‌లైన్‌ను కూడా కంపెనీ నిర్దేశించింది. లో-కాస్ట్ విభాగంలో మీషో, ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన షాప్సీలు గణనీయమైన మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి. రిలయన్స్ సైతం అజియో స్ట్రీట్ పేరుతో కొత్త ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ క్రమంలో అమెజాన్ ఈ విభాగంలో మార్కెట్ వాటాను సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. దీనికోసం వినియోగదారులకు సున్నా రిఫరల్ ఫీజు, తక్కువ ధరలో ఉత్పత్తులను అందించేందుకు చూస్తోంది.


Next Story

Most Viewed