భారీగా పెరుగుతున్న ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ యూజర్లు

by Dishanational1 |
భారీగా పెరుగుతున్న ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ యూజర్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: డిజిటల్ చెల్లింపుల రంగంలో ఆధిపత్యం కొనసాగిస్తున్న పేటీఎంపై ఇటీవల ఆర్‌బీఐ ఆంక్షల నేపథ్యంలో ఇతర పేమెంట్స్ బ్యాంకులు, యూపీఐ ప్లాట్‌ఫామ్‌లు పండుగ చేసుకుంటున్నాయి. పేటీఎమ్ కొనసాగడంపై సందేహాలు నెలకొనడంతో యూజర్లు ఇతర యూపీఐలకు మారుతున్నారు. తాజాగా ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకులో కొత్తగా ఖాతాలు తెరుస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని కంపెనీ సీఈఓ అనుబ్రత బిస్వాస్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా కొత్త యూజర్లు ఫాస్టాగ్ చెల్లింపుల కోసమే ఇతర యూపీఐలను అన్వేషిస్తున్నట్టు సమాచారం. ఆర్‌బీఐ ఆంక్షల ప్రకటన జరిగిన జనవరి 31 తర్వాత ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకులో కొత్తగా చేరిన యూజర్ల సంఖ్య గురించి అనుబ్రత బిస్వాస్ స్పష్టత ఇవ్వలేదు. అయితే, 'డిజిటల్ చెల్లింపులు, ఎఫ్‌డీ, ఇంకా ఇతర కారణాలతో చాలామంది యూజర్లు దరఖాస్తు చేసుకున్నారు. గత కొన్నిరోజుల్లోనే ఆన్‌లైన్ అప్లికేషన్ల సంఖ్య 5-7 రెట్లు పెరిగిందని ' బిస్వాస్ పేర్కొన్నారు. ఇన్సూరెన్స్, లెండింగ్, ఇన్వెస్ట్‌మెంట్ సొల్యూషన్స్ వంటి డిజిటల్ సేవలతో పాటు డిజిటల్ బ్యాంకింగ్ పరిష్కారాలతో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ 700 కోట్ల వార్షిక లావాదేవీలను నిర్వహిస్తోంది.


Next Story