ఎయిర్ ఇండియా భారీ ఆర్డర్, వ్యాపార వ్యూహంపై స్పందించిన సీఈఓ క్యాంప్‌బెల్!

by Disha Web Desk 17 |
ఎయిర్ ఇండియా భారీ ఆర్డర్, వ్యాపార వ్యూహంపై స్పందించిన సీఈఓ క్యాంప్‌బెల్!
X

న్యూఢిల్లీ: టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా విస్తరణ ప్రణాళికలో భాగంగా 470 విమానాల చారిత్రాత్మక ఆర్డర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన కొద్ది రోజుల తర్వాత సంస్థ సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ సోమవారం దీనికి సంబంధించిన నిధుల సమీకరణ వివరాలను వెల్లడించారు. భారీ సంఖ్యలో విమానాలను కొనేందుకు రూ. 5.80 లక్షల కోట్ల కోసం అంతర్గత నగదు, ఈక్విటీ సహా ఇతర మార్గాల్లో నిధులను సమకూర్చాలని భావిస్తున్నట్లు చెప్పారు.

ప్రపంచ విమానయాన కేంద్రంగా భారత్ మారనుందని, ఈ క్రమంలో విమానయాన చరిత్రలోనే ఇదొక గొప్ప పరిణామమని క్యాంప్‌బెల్ తెలిపారు. ఈ భారీ ఆర్డర్ ద్వారా ఎయిర్ ఇండియా తన పాత విమానాలను తొలగించడమే కాకుండా దేశీయంగా పెరుగుతున్న విమాన ప్రయాణాల రద్దీని తీర్చగలదని చెప్పారు. ఇదే సమయంలో ఎయిర్ ఇండియా భవిష్యత్తు మార్కెట్ వ్యూహం గురించి మాట్లాడిన క్యాంప్‌బెల్, ఎయిర్ఇండియాకు ఉన్న సామర్థ్యం, పనితీరు ద్వారా అంతర్జాతీయ విమానయాన సంస్థగా ఎదిగే అవకాశాలున్నాయన్నారు. దీనికోసం విస్తారా విలీనంపై దృష్టి పెట్టనున్నట్టు ఆయన తెలిపారు.

విలీనం తర్వాత కూడా సంస్థను ఎయిర్ ఇండియా పేరుతోనే కొనసాగిస్తామని, అంతర్జాతీయంగా సంస్థకున్న గుర్తింపును మార్చబోమని స్పష్టం చేశారు. విస్తారా కంపెనీకి భారత మార్కెట్లో మెరుగైన గుర్తింపు ఉంది. ఇదే సమయంలో భారత్‌కు వెలుపల దానికి మరింత బలం ఉంది. 90 ఏళ్ల చరిత్ర ఉన్న ఎయిర్ ఇండియాను కొనసాగిస్తూనే, విస్తారా వారసత్వాన్ని కొంతవరకు విలీన సంస్థలో ఉండాలని భావిస్తున్నామని క్యాంప్‌బెల్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతానికి ఈ విలీన ప్రక్రియ సీసీఐ అనుమతుల కోసం వేచి ఉందని ఆయన పేర్కొన్నారు.



Next Story

Most Viewed