అదానీ చేతికి గోపాల్‌పూర్ పోర్ట్‌.. డీల్ విలువ రూ.3,350 కోట్లు

by Disha Web Desk 17 |
అదానీ చేతికి గోపాల్‌పూర్ పోర్ట్‌.. డీల్ విలువ రూ.3,350 కోట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఒడిశాలోని గోపాల్‌పూర్ పోర్ట్‌ను గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్‌కు విక్రయిస్తున్నట్లు షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌ ప్రకటించింది. ఈ విషయాన్ని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రణాళికాబద్ధమైన ఆస్తుల నగదీకరణ వ్యూహంలో భాగంగా దీనిని అమ్మినట్లు షాపూర్జీ గ్రూప్‌ పేర్కొంది. మొత్తం ఈ ఒప్పందం విలువ రూ. 3,350 కోట్లు. గోపాల్‌పూర్ పోర్ట్‌ సామర్థ్యం 20 మిలియన్ టన్నులుగా ఉంది. నిర్మాణంలో ఉన్న ఈ ఓడరేవును 2017లో ఎస్పీ గ్రూప్ కొనుగోలు చేసింది. రుణాలను తగ్గించుకుని వృద్ధిని పెంచుకోవడానికి పెట్టుబడుల ఉపసంహరణను చేపట్టినట్లు ఎస్పీ గ్రూప్ పేర్కొంది.

2015లో మహారాష్ట్రలోని ధరమ్‌తర్ పోర్ట్‌ను కొనుగోలు చేసి దాని వార్షిక సామర్థ్యాన్ని 1 మిలియన్ టన్నుల నుంచి 5 మిలియన్ టన్నులకు ఎస్పీ గ్రూప్ పెంచింది. అయితే దీనిని కూడా ఇటీవల రూ.710 కోట్ల ఎంటర్‌ప్రైజ్ విలువకు JSW ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌కు విక్రయించింది. గోపాల్‌పూర్ పోర్ట్ అల్యూమినియం, బొగ్గు, ఇల్మెనైట్, ఇనుప ఖనిజం, సున్నపురాయితో సహా అనేక రకాల డ్రై బల్క్ ఎగుమతి/దిగుమతులను నిర్వహిస్తుంది.


Next Story