తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు

by Dishanational1 |
తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గనున్నాయి. ముడిచమురు ధరలు దిగిరావడంతో భారతీయ చమురు మార్కెటింగ్ కంపెనీలకు(ఓఎంసీ) వాహన ఇంధనాల రిటైల్ అమ్మకాలపై మార్జిన్లు గత కొన్ని వారాలుగా మెరుగుపడ్డాయని ఇక్రా నివేదిక తెలిపింది. 'అంతర్జాతీయ ధరలతో పోలిస్తే ఓఎంసీల వద్ద నికరంగా పెట్రోల్ లీటర్‌కు రూ. 11, డీజిల్‌పై లీటర్‌కు రూ. 6 ఎక్కువగా ఉంది. 2023, సెప్టెంబర్‌లో భారీగా క్షీణించిన తర్వాత గత కొన్ని నెలల్లో పెట్రోల్ మార్కెటింగ్ మార్జిన్లు మెరుగుపడ్డాయి. 2023, అక్టోబర్ వరకు డీజిల్ మార్జిన్లు ప్రతికూలంగా ఉన్నప్పటికీ, నవంబర్ నుంచి సానుకూలంగా మారాయి. గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ధరలు స్థిరంగా ఉన్నట్లయితే దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఇంధన ధరలు తగ్గించే వీలుందని' ఇక్రా గ్రూప్ హెడ్ గిరీష్‌కుమార్ కదమ్ వివరించారు. ప్రస్తుతం బెంచ్‌మార్క్ క్రూడ్ ధరలు బ్యారెల్‌కు 80 డాలర్ల కంటే తక్కువగానే ఉన్నాయి. లిబియా, నార్వేలో డిమాండ్ తగ్గి, ఉత్పత్తి పెరగడంతో ముడి చమురు ధరలు తగ్గుతున్నాయి. మధ్యప్రాచ్యంలోని ఉద్రిక్తతల కారణంగా ఈ పరిణామాలు ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు అంచనాల కంటే తక్కువ ఉన్నాయని డేటా చెబుతోంది. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ తాజా నెలవారీ నివేదికలో, ఈ ఏడాది ప్రపంచ చమురు సరఫరా డిమాండ్‌ను మించి ఉంటుందని అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల తర్వాత 2024, మే నాటికి దేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. కాబట్టి ప్రభుత్వం రాబోయే ఏడాది పాటు పెట్రోల్, డీజిల్ ధరలను మరింత తగ్గించే అవకాశం ఉంది.


Next Story