శక్తివంతమైన పాస్‌పోర్ట్ జాబితాలో భారత్ స్థానం ఎక్కడంటే..

by Dishanational1 |
శక్తివంతమైన పాస్‌పోర్ట్ జాబితాలో భారత్ స్థానం ఎక్కడంటే..
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాదికి సంబంధించి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టులను కలిగిన దేశాల జాబితాలో భారత్ 80వ స్థానం దక్కించుకుంది. ఇందులో ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, జపాన్, సింగపూర్ దేశాల పాస్‌పోర్టులు మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి. తాజాగా విడుదలైన హెన్లీ పాస్‌పోర్ట్ సూచీ' నివేదిక ప్రకారం, 227 దేశాల జాబితాలో మొదటి ఆరు దేశాల పాస్‌పోర్టులతో 194 దేశాలకు వీసాలేని ప్రయాణం చేసే అవకాశం లభిస్తుంది. గత ఐదేళ్ల నుంచి ఈ జాబితాలో సింగపూర్, జపాన్ దేశాలు అగ్రస్థానంలో నిలిచాయి. ఆ తర్వాత దక్షిణ కొరియా, ఫిన్‌లాండ్, స్వీడన్ దేశాల పాస్‌పోర్టులతో 193 దేశాలకు సులభంగా వెళ్లవచ్చు. వీటి తర్వాత ఆస్ట్రియా, డెన్‌మార్క్, ఐర్లాండ్, నెదర్లాండ్ పాస్‌పోర్టులు ఉంటే 192 దేశాలకు ముందస్తు వీసా లేకుండా వెళ్లే వీలుంది. ఇక, 80వ స్థానంలో ఉన్న భారత పాస్‌పోర్టుతో 62 దేశాలకు వెళ్లే అవకాశం ఉంది. గతేడాది 59 దేశాలకు మాత్రమే ఈ అవకాశం ఉంది. ఇక, హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో చివరి స్థానంలో ఆఫ్ఘానిస్తాన్ ఉంది. 104వ ర్యాంక్ సాధించిన ఈ దేశ పాస్‌పోర్ట్‌ను ఉపయోగించి 28 దేశాలు మాత్రమే ప్రయాణించవచ్చు.


Next Story