ఆర్థిక వృద్ధికి మరికొన్ని త్రైమాసికాలు

by  |
ఆర్థిక వృద్ధికి మరికొన్ని త్రైమాసికాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్థిక పునరుద్ధరణ నెమ్మదిగా ఉంటుందని, రుణాలకు, క్రెడిట్ కార్డుల వినియోగానికి డిమాండ్ పెరగడం భవిష్యత్తుపై ఆశలు కలిగిస్తున్నాయని యాక్సిస్ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్, ఎండీ అమితాబ్ చౌదరీ తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, ప్రభుత్వం మరో ఉద్దీపన చర్యలను ప్రకటిస్తుందనే దానిపై సందేహాలున్నాయని, ఆర్థిక పునరుద్ధరణ నెమ్మదిగా ఉండొచ్చని అమితాబ్ అభిప్రాయపడ్డారు.

జూన్ త్రైమాసికంలో దేశ జీడీపీ నాలుగో వంతు కుదించుకుపోయిందని, ఎక్కువ శాతం మంది పునరుజ్జీవన సంకేతాల కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. వాస్తవ పరిస్థితుల గురించి పలువురు సీఈవోలతో చర్చించినపుడు మనమింకా పూర్తిస్థాయిలో రికవరీ కాలేదని, స్థిరమైన వృద్ధితో కోలుకునేందుకు ఇంకా కొన్ని త్రైమాసికాలు పట్టొచ్చని ఆయన వివరించారు. నిరంతర నిరుద్యోగం, స్థిరమైన ఆర్థిక వృద్ధి కారణంగా రికవరీ అనేదిక నెమ్మదిగానే ఉంటుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారని ఆయన ప్రస్తావించారు.

ప్రస్తుతం ఎల్-షేప్ రికవరీ ఉండొచ్చు. ఇందులో పునరుజ్జీవనం నెమ్మదిగా, స్థిరంగా ఉంటుందని, దీనికి చాలా సమయం పడుతుందని అమితాబ్ పేర్కొన్నారు. అయితే, కస్టమర్ల పట్ల తమకు అత్యంత విశ్వాసం ఉంది. ఈ విశ్వాసం తమను మరింత వేగంగా వృద్ధి సాధించేందుకు దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్వల్పకాలిక లాక్‌డౌన్‌లను తొలగించాలని, ఇలాంటి చర్యలు పునరుజ్జీవన ప్రణాళిక సామర్థ్యాన్ని దెబ్బ తీస్తాయని సూచించారు.

Next Story