దక్షిణ కాశీ బుగ్గ రామలింగేశ్వర ఉత్సవాలకు సర్వం సిద్ధం..

by  |
దక్షిణ కాశీ బుగ్గ రామలింగేశ్వర ఉత్సవాలకు సర్వం సిద్ధం..
X

దిశ, యాచారం : రంగారెడ్డి జిల్లాలోని మంచాల మండల కేంద్రం ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఉత్సవాలకు ఆలయ నిర్వాహకులు సర్వం సిద్ధం చేశారు. ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో కొలిచే విశిష్ట దైవంగా పేరొందిందిన క్షేత్రం. గురువారం నుండి ప్రారంభమై డిసెంబర్ 4 వరకు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి. రాష్ట్రంలో 15 రోజుల పాటు నిర్విరామంగా జరిగే అతిపెద్ద జాతర ఇదే కావడం గమనార్హం. 15 రోజుల పాటు జరిగే ఉత్సవాల కోసం ఆలయాన్ని అందమైన రంగులతో అలంకరించారు. వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గత ఏడాది కరోనా కారణంగా ఉత్సవాలు నిర్వహించకపోవడంతో ఈ ఏడాది అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఈ ఉత్సవాల నిర్వహణ కమిటీ, ప్రజాప్రతినిధులు, అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎంతో మహిమాన్విత మైన ఈ ఆలయానికి పురాతన చరిత్ర ఉంది. కోరిన కోరికలు కొంగు బంగారంగా నిలుస్తున్న రామలింగేశ్వర ఆలయానికి గొప్ప చరిత్ర ఉందని అక్కడి ప్రాంత ప్రజల అభిప్రాయం. పూర్వం రాముడు ఇక్కడ శివ లింగాన్ని నెలకొల్పి పూజించినట్టుగా పెద్దలు తరతరాలుగా చెప్తున్నారు. తర్వాత ఇక్కడ నీటి గుండంలో చిన్న నీటి బుడగ పుట్టిందని, ఏ కాలంలో అయినా ఎంత కరువొచ్చిన ఇక్కడ స్వచ్చమైన నీరు ఉబికి వస్తుంది. 14 వ శతాబ్దంలో రాచకొండ రాజులు రేచర్ల పద్మనాయక వంశస్తుల పరిపాలనలో ఈ బుగ్గ రామలింగేశ్వర స్వామి పూజలందుకున్నట్టు ప్రతీతి.

నాటి నుండి నేటి వరకు ప్రతీ సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజు రాత్రి నుంచి ఇక్కడ కార్తీక స్నానమాచరిస్తారు. ఎముకలు కొరికే చలిని కూడా లెక్క చేయకుండా భక్తులు ఇక్కడి నీటి గుండంలో స్నానాలు చేస్తారు. చాలా మంది భక్తులు స్వామి సన్నిధిలో ఒక రాత్రి నిద్ర చేసి మరుసటి రోజు స్వామి దర్శన అనంతరం కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేసుకొని అందమైన అడవిలో ఆనందంగా గడుపుతారు. స్వామి ఆలయం పక్కనే కబీర్ దాస్ మందిరం ఉన్నది . దీనిని హైదరాబాద్‌కు చెందిన నర్సింహ బాబా అనే భక్తుడు కాశీలో ఉపదేశం పొంది 1975లో ఇక్కడ కబీర్ దాస్ ఆలయాన్ని నిర్మించి ఇక్కడే సజీవ సమాధి అయ్యారు. కబీర్ దాస్ ఆలయానికి ఎదురుగా పెద్ద పుట్టతో ఉన్న నాగదేవత ఆలయం ఉన్నది. ఇక్కడ మహిళలు పెద్ద ఎత్తున నాగదేవత పుట్టలో పాలు పోసి పూజిస్తారు.ఈ ఆలయానికి స్థానిక భక్తులే కాక తెలంగాణ రాష్ట్ర తో పాటు ఆంధ్ర రాష్ట్రాల భక్తులు కూడా వచ్చి స్వామిని దర్శించుకుంటారు.

ఇక్కడ గుండంలోకి తూర్పు దిక్కు నుండి నీరువచ్చి మళ్లీ పడమరకు దిక్కున కొద్ది దూరం పారుతూ పోయి మళ్ళీ తూర్పుకు మళ్లీ ఆ నీళ్ళు బండ రాళ్లలోకి పోతాయి. కార్తీక పౌర్ణమి నాడు ప్రారంభమైన ఉత్సవాలకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను నడపనుంది. నగరంలోని ఎంజీబీఎస్ నుండి (277 నెంబర్) బస్సు ఇబ్రహీంపట్నం చేరుకొవాలి. ఇబ్రహీంపట్నం డిపో నుండి ప్రత్యేకంగా బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర పేరుతో ఆర్టీసీ బస్సులు నడుపుతారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ నుండి ఆర్టీసీ బస్సులు నడుపనున్నారు. దీనిని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎంతో మహిమగల రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని మరింతగా అభివృద్ధి చేసి ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటమన్నారు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి నిధులు రావడంతో పలు అభివృద్ధి పనులు చేపట్టాం. ఆలయానికి రహదార్ల నిర్మాణం, సీసీ రోడ్లు , ఇప్పటికే పూర్తయ్యాయి. భక్తుల సహకారంతో మరింత అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు.

ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి..

ఉత్సవాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. 15 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. పోలీసులు , వైద్యం, విద్యుత్, నీటి సరఫరా, తదితర శాఖల అధికారుల సహకారంతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటాం..

-సర్పంచ్ కొంగర విష్ణువర్ధ రెడ్డి


Next Story

Most Viewed