‘ద పేషంట్‌ అసాసిన్‌’‌కు యూకే పురస్కారం

by  |
‘ద పేషంట్‌ అసాసిన్‌’‌కు యూకే పురస్కారం
X

దిశ, వెబ్‌డెస్క్: భారత స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో జరిగిన అత్యంత దురదృష్టకరమైన సంఘటనగా ‘జలియన్‌వాలా బాగ్‌’ ఊచకోత నిలిచిపోయింది. అమృత్‌సర్‌లోని ఓ తోటలో సమావేశమైన భారతీయులపై బ్రిటిష్ బ్రిగేడియర్ జనరల్ డయ్యర్ సారథ్యంలోని సైనికులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 370 మందికి పైగా చనిపోయిన విషయం తెలిసిందే. ఈ దురంతం నేపథ్యంలో బ్రిటిష్‌ ఇండియన్‌ జర్నలిస్ట్‌, రచయిత్రి అనితా ఆనంద్‌ రాసిన ‘ద పేషంట్‌ అసాసిన్‌ – ఎ ట్రూ టేల్‌ ఆఫ్‌ మసాకర్‌’ పుస్తకానికి యూకేకు చెందిన పెన్‌ హెసిల్‌-టిల్ట్‌మన్‌ పురస్కారం లభించింది.

పెన్ హెసిల్ టిల్ట్‌మన్ పురస్కారానికి ఏడుగురు రచయితలు పోటీపడగా, అనిత ఈ అవార్డును గెలుచుకున్నారు. జలియన్ వాలాబాగ్‌పై రచించిన గొప్ప చారిత్రక రచనగా, వాస్తవిక చారిత్రక నేపథ్యం ఉన్న పుస్తకంగా ‘ద పేషంట్‌ అసాసిన్‌’ను అవార్డు కమిటీ అభివర్ణించింది. ఈ పుస్తకాన్ని రివెంజ్ కథగా చెప్పొచ్చు. జలియన్‌ వాలాబాగ్‌ దురాఘతం, తర్వాత జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఆమె దీనిని రచించారు. ఆ దమనకాండకు కారణమైన బ్రిటిష్‌ అధికారిపై ఓ బాధితుడు రెండు దశాబ్దాల తర్వాత ఎలా పగ తీర్చుకున్నాడన్నది ఈ పుస్తక కథ. కాగా పెన్ హెసిల్ టిల్ట్‌మన్ అవార్డును పొందిన రచయిత అనితకు 2 వేల పౌండ్లు దక్కనున్నాయి.

పెన్ అంటే పోయెట్స్, ప్లేరైట్స్, ఎడిటర్స్, ఎస్సేయిస్ట్, నావలిస్ట్స్ కూడిన బృందం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైటర్స్ అసోసియేషన్స్‌కు ‘పెన్ ఇంటర్నేషనల్‌’‌ వేదిక. 100 దేశాల్లో దాదాపు 145 పెన్ సెంటర్స్ ఉన్నాయి. పెన్‌లో సభ్యుడైన మార్జోరి హెసెలె టిల్ట్‌మన్ 1999లో మరణించింది. ఆమె పేరిట ఒక బహుమతిని ఇవ్వాల్సిందిగా కోరుతూ ఆమె 100,000 పౌండ్లను పెన్ లిటరరీ ఫౌండేషన్‌కు ఇచ్చింది.


Next Story

Most Viewed