తల్లిపాలే శిశువుకు అమృతం

by  |
తల్లిపాలే శిశువుకు అమృతం
X

దిశ, వెబ్‌డెస్క్ : అమ్మపాలలో శిశు సమగ్రాభివృద్ధికి దోహదపడే మాంసకృత్తులు, పిండి పదార్థాలు, ఐరన్‌, కాల్షియం, ఖనిజాలు, యాంటీబాడీలు, విటమిన్లు, కొవ్వులతో పాటు అనేక ఇతర పోషకాలు సమపాళ్లలో ఉంటాయి. న్యూమోనియా, కలరా, కామెర్లలాంటి వ్యాధుల నుంచి శిశువును రక్షించగలిగే అమ్మ పాలు జీవితాంతం అత్యుత్తమ టీకా ఔషధంగా పని చేస్తుంది. తల్లిపాలతో శిశువు ఎదుగుదలే కాకుండా తల్లి ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. బిడ్డ ప్రసవం జరగగానే లభించే ముర్రు పాలలో అద్వితీయ పోషక విలువలు ఉంటాయి. ముర్రుపాలతో ప్రత్యేక పోషకాలు లభించడమే కాకుండా వ్యాధికారక వైరస్‌లు, బ్యాక్టీరియాల పట్ల నిరోధకశక్తి పెరుగుతుంది. ముర్రుపాలు మంచివి కావనే దురభిప్రాయాలను దూరం చేస్తూ, తప్పక తాగించి, శిశువు జీవితకాల ఆరోగ్యానికి పుణాదులు వేయాలి. ముర్రు పాలతో శిశువు పేగుల శుద్ధి జరగడం, ఎలర్జీలను నిరోధించడం, జీవితాంతం పలు ప్రమాదకర రోగాలు రాకుండా నివారించడం, శిశు శారీరక మానసిక వికాసానికి దోహదపడడం లాంటి ప్రయోజనాలు కలుగుతాయి. శిశు జననం నుంచి కనీసం ఆరు మాసాలు అమ్మపాలు తప్పనిసరిగా అందించాలి. శిశువు ఆరు మాసాలు దాటిన తరువాత 1-2 ఏండ్ల పాటు అమ్మపాలు అందించడం ద్వారా పిల్లల సమగ్ర ఎదుగుదల సమకూరుతుంది. ‘ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు-2021’ నినాదంగా ‘తల్లి రొమ్ముపాలను సమిష్టి బాధ్యతగా రక్షిద్దాం’ అనే అంశాన్ని తీసుకున్నారు.

ఇదీ పరిస్థితి..

ప్రపంచవ్యాప్తంగా 7.6 మిలియన్ల శిశువులకు తల్లి పాలు అందడం లేదు. అధిక ఆదాయ వర్గాలలో 21 శాతం, మధ్య తరగతి పిల్లలలో 4 శాతం రొమ్ముపాల రుచిని చూడడమే లేదు. ఇండియా, చైనా, నైజీరియా, ఇండోనేషియాలాంటి దేశాల్లో తల్లిపాలు లభించని కారణంగా పలు వ్యాధులతో ఏటా లక్షల శిశు మరణాలు నమోదు అవుతున్నాయి. భారతదేశంలో 79 శాతం ప్రసవాలు ఆరోగ్య కేంద్రాలలో జరిగినప్పటికీ, తొలి గంటలో 42.6 శాతం తల్లులు మాత్రమే రొమ్ముపాలు అందిస్తున్నారు. తొలి ఆరు మాసాలు తల్లి పాలు మాత్రమే అందించి, అనంతరం అదనపు పోషకాహారంతోపాటు రొమ్ముపాలు అందించాలి. సంపన్న కుటుంబాల తల్లుల కంటే పేద కుటుంబాల తల్లులే అధికంగా చనుబాలను అందిస్తున్నారు. శిశు జననంతో తల్లి పాలు ఉత్పత్తి కావడం, నవజాత శిశువు రొమ్ము పట్టి పాలు త్రాగడం, తల్లిబిడ్డల మధ్య అద్వితీయ ప్రేమానుబంధాలు ఉద్భవించడం ఓ అద్భుత సృష్టి రహస్యమనే చెప్పాలి. తల్లిపాలు అందించాలనే లక్ష్యంతో ఉద్యోగిణులకు, ఉద్యోగులకు ప్రత్యేక సెలవు సౌకర్యం కల్పించబడింది. పాలు పట్టించడం వల్ల తల్లులకు రొమ్ము కాన్సర్‌, ఓవేరియన్‌ కాన్సర్‌, మధుమేహం, స్థూలకాయం, రక్తస్రావం, గుండె జబ్బులు, వెంటనే గర్భం దాల్చే అవకాశం లాంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి. శారీరక సౌందర్యం తగ్గుతుందనే దురభిప్రాయంతో సంపన్న కుటుంబాల తల్లులు పాలు ఇవ్వడానికి చొరవ చూపక పోవడం అమానవీయం, విస్తృత అవగాహన కల్పించినప్పటికి 50 శాతం తల్లులు తొలి ఆరు మాసాలు, 25 శాతం తొలి ఏడాది వరకు రొమ్ముపాలు అందిస్తున్నారని తేలింది.

అవగాహన కలిగించాలి

పేద కుటుంబాలలో తల్లుల అనారోగ్యం, పాలు పడకపోవడం, పని ఒత్తిడిలో నిర్లక్ష్యం చేయడం, అవగాహన లేకపోవడంలాంటి కారణాలతో పిల్లలు బలహీనంగా ఉంటూ, రోగాల పాలు కావడం, కొన్ని సందర్భాలలో మరణించడం కూడా జరుగుతున్నది. కరోనా విపత్తులో పేదరికం పెరగడం, ఆర్థికంగా చితికిపోవడం, ఉపాధి లేకపోవడంతో తల్లిపాలు అందించడంలో అవాంతరాలు ఏర్పడుతున్నాయి. గర్భిణి, తల్లి, శిశువు ఆరోగ్య రక్షణకు అవనరమైన ఆసుపత్రులను నెలకొల్పవలసిన కనీస బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. తల్లిపాలను రక్షించి, చిన్నారులకు అందించి, ఆరోగ్య సమాజాన్ని నిర్మించే ప్రయత్నాలు చేద్దాం. (నేటి నుంచి ‘ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు’)

డా. బుర్ర మధుసూదన్‌రెడ్డి
కరీంనగర్‌
9949700037Next Story