మరోసారి ధరలను పెంచనున్న బ్లూస్టార్!

by  |
మరోసారి ధరలను పెంచనున్న బ్లూస్టార్!
X

దిశ, వెబ్‌డెస్క్: ముడి పదార్థాలు, సరుకు రవాణా ఛార్జీలు పెరిగిన తర్వాత ఎయిర్‌కండీషనర్(ఏసీ) ధరలను ఏప్రిల్ నుంచి పెంచనున్నట్టు దేశీయ ప్రముఖ సంస్థ బ్లూ స్టార్ లిమిటెడ్ బుధవారం వెల్లడించింది. జనవరిలో కూడా కంపెనీ ధరలను పెంచిన సంగతి తెలిసిందే. సరసమైన ధరల విభాగంలో ఆన్‌లైన్‌లో కొత్త ఉత్పత్తులను బ్లూ స్టార్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ త్యాగరాజన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన… ఏసీ పరిశ్రమ ఈ ఏడాది 15-20 శాతం వృద్ధి సాధిస్తుందని, ఈ వేసవికి 30 శాతం వృద్ధిని సాధించాలని ఆశిస్తున్నట్టు ఆయన తెలిపారు.

అలాగే, మొత్తం 2021-22 ఆర్థిక సంవత్సరాంకి పరిశ్రమ 25 శాతం వృద్ధిని నమోదు చేయవచ్చని అభిప్రాయపడ్డారు. ఇటీవల వస్తువుల ధరలు, ఉక్కు, రాగి, ప్లాస్టిక్, సముద్ర సరుకు రవాణా ఖర్చులు పెరుగుతున్న సమయంలో మరోసారి ఉత్పత్తుల ధరలు పెంచడం తప్ప వేరే మార్గం కనిపించడంలేదని ఓ ప్రకటనలో త్యాగరాజన్ వెల్లడించారు. అలాగే, కంపెనీ ప్రస్తుతం రూ. 250 కోట్ల పెట్టుబడులను పెడుతుందని, రానున్న మూడేళ్లలో అదనంగా మరో రూ. 270 కోట్ల కోట్లను పెట్టనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ పెట్టుబడులు దిగుమతులను తగ్గించి స్థానికంగా తయారీకి ప్రాధాన్యత ఇవ్వడానికి తోడ్పాటునందిస్తుందన్నారు.



Next Story

Most Viewed