20 శాతం తగ్గిన ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు!

by  |
20 శాతం తగ్గిన ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు!
X

దిశ, వెబ్‌డెస్క్: గత ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు 20 శాతం క్షీణించాయి. కీలకమైన ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ విభాగంలో అమ్మకాలు 37 శాతం తగ్గిపోవడంతో మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలపై ప్రభావం కనిపించిందని సెంటర్ ఫర్ ఎనర్జీ ఫైనాన్స్ తెలిపింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో మొత్తం 1,68,311 యూనిట్ల అమ్మకాలు నమోదవగా, 2020-21లో 1,34,619 యూనిట్ల అమ్మకాలు జరిగాయని గణాంకాలు వెల్లడించాయి. ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ అమ్మకాలపై కొవిడ్ ప్రభావం అధికంగా ఉందని, ఇవి 2019-20లో 1,40,683 యూనిట్ల నుంచి 2020-21లో 88,378 యూనిట్లకు పడిపోయాయి. ఎలక్ట్రిక్ టూ-వీలర్, కార్ల అమ్మకాలు పెరిగినప్పటికీ గతంలో సాధించిన అద్భుతమైన వృద్ధి ధోరణిని కొనసాగించలేకపోయాయి.

ఈ ఏడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రిక్ టూ-వీలర్ వాహనాలు 24,839 యూనిట్ల నుంచి 40,837 యూనిట్లకు పెరిగాయి. మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలో టూ-వీలర్ అమ్మకాలు 96 శాతం వాటాను కలిగి ఉన్నప్పటికీ, అమ్మకాల క్షీణత వల్ల ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ వాటా 83 శాతం నుంచి 65 శాతానికి తగ్గింది. ఇక, 25 కి.మీ కంటే ఎక్కువ వేగంగా వెళ్లే టూ-వీలర్ ఎలక్ట్రిక్ వాహనాల వాటా 14 శాతం నుంచి 30 శాతానికి పెరిగింది. ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు సైతం గణనీయంగా పెరిగాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో 2,727 యూనిట్ల నుంచి 4,588 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. ముఖ్యంగా ఈసారి కొత్త ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్లోకి రావడంతో ఈ వృద్ధి నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 23 కొత్త ఎలక్ట్రిక్ మోడళ్లు రానున్నాయి.

Next Story

Most Viewed