Black fungus: బ్లాక్‌లో బ్లాక్ ఫంగస్ మందులు.. ఈఎన్‌టీలో సిబ్బంది దందా!

by  |
Koti ENT Hospital2
X

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా చికిత్సలకు రెమిడెసివిర్ మందుల కొరత ఏ విధంగా ఏర్పడిందో బ్లాక్ ఫంగస్ కు అవరమయ్యే ఆంఫోటెరిసిన్ బి ఇంజక్షలకు కూడా అదే కొరత ఏర్పడింది. కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రిలో ఫంగస్ నియంత్రణకు వినియోగించే ఆంఫోటెరిసిన్ బి మందుల కొరత ఏర్పడడంతో మెడికల్ మాఫియా బ్లాక్ మార్కెట్ కు తెరలేపాయి. రూ.7,900 ఉన్న ఇంజక్షలను రూ.35వేలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈఎన్‌టీ ఆసుపత్రి సిబ్బంది కొందరు మధ్యవర్తులను ఏర్పాటు చేసుకొని ఈ దందాను కొనసాగిస్తునట్లు సమాచారం.

కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రికి బ్లాక్ ఫంగస్ రోగుల తాకిడి రోజురోజకి పెరుగుతోంది. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన 230 బెడ్లలో పేషెంట్లకు చికిత్సలందిస్తున్నారు. ఫంగస్‌ను నియంత్రించేందుకు అవసరమైన మందులు ఈఎన్‌టీ ఆసుపత్రిలో అందుబాటులో లేకపోవడంతో ఒక్క సారిగా ఈ మందులకు డిమాండ్ ఏర్పడింది. దీంతో ఫార్మా ఏజెన్సీలు బ్లాక్ దందాకు తెరలేపాయి. గుట్టు చప్పుడు కాకుండా అధిక ధరలకు ఆంఫోటెరిసిన్ బి మందులను విక్రయిస్తున్నారు.

‘ఆంఫోటెరిసిన్ బి’కి పెరిగిన డిమాండ్

బ్లాక్ ఫంగస్ వ్యాధి సోకిన పేషెంట్లలో ఫంగస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ఆంఫోటెరిసిన్ బి ఇంజక్షన్ ను ఇవ్వాల్సి ఉంటుంది. పేషెంట్లలో ఫంగస్ స్థాయిని బట్టి 21 వాయిల్స్ నుంచి అవసరమైన మేరకు వాయిల్స్‌ను అందించి డాక్టర్లు చికిత్సలందిస్తున్నారు. ఈఎన్‌టీ ఆసుపత్రిలో చేరిన పేషెంట్లకు సరిపడా ఆంఫోటెరిసిన్ బి ఇంజక్షలు లేకపోవడంతో తీవ్రమైన కొరత ఏర్పడుతుంది. ఈ ఇంజక్షన్లు వేస్తేనే పేషెంట్ల ప్రాణాలు కాపాడగలమని డాక్టర్లు సూచించడంతో అటెండెంట్లు ఆంఫోటెరిసిన్ కోసం బ్లాక్ మార్కెట్‌ను ఆశ్రయిస్తున్నారు.

రూ.35,000లకు అమ్మకాలు

ఆంపోటెరిసిన్ బి 50ఎంజీ ఇంజక్షన్ అసలు ధర రూ.7.900 ఉండగా బ్లాక్ మార్కెట్‌లో వీటిని రూ.35వేలకు విక్రయిస్తున్నారు. పేషెంట్ల అవసరాలను గుర్తించిన కొందరు ఆసుపత్రి వార్డ్ బాయిలే ఈ బ్లాక్ దందాకు తెరలేపారు. ఇంజక్షన్లు అవసరమైన పేషెంట్ల అటెండెంట్లను సంప్రదించి ఆంఫోటెరిస్ బి కావాలంటే సరఫరా చేస్తామని చెబుతున్నారు. ప్రాణాలు కాపాడుకునేందుకు పేషెంట్ల అటెండెంట్లు అడిగిన కాడికి సొమ్మును ముట్టజెప్పుతున్నారు. ఆసుపత్రి వర్గాలే గుట్టు చప్పుడు కాకుండా ఈ వ్యవహారాన్ని నడిపిస్తుండటంతో ఎక్కడా బయటకి రావడం లేదు. బ్లాక్ మార్కెట్ లో కొనుగోలు చేసిన ఇంజక్షన్లను ఆసుపత్రి సిబ్బంది అనధికారికంగా పేషెంట్లకు అందిస్తున్నారు. ప్రాణాలు కాపాడుకోవడం కోసం పేషెంట్లు, అటెండెంట్లు ఈ వ్యవహారాన్ని ప్రశ్నించలేకపోతున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed