దేవాదాయ శాఖ అధికారులపై అనుమానం.. బీజేవైఎం హెచ్చరిక

by  |
BJYM-leaders-protest
X

దిశ, నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ నగరంలోని శ్రీ నీలకంఠేశ్వర ఆలయం, శంబూనిగుడి, పెద్ద రాంమందిరం ఆలయ భూములను, ఆస్తులను కాపాడాలని బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి పటేల్ ప్రసాద్ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలో దేవాదాయ శాఖ సహాయ కమిషనర్, జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట నిరసన చేశారు. ఈ సందర్భంగా బీజేపీ, బీజేవైఎం, బజరంగ్ దళ్, హిందూ వాహిని నాయకులు కలెక్టరేట్ ఏవోకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పటేల్ ప్రసాద్ మాట్లాడుతూ.. నిజామాబాద్ నగరం ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగి ఉన్నదని, అనేక దేవాలయాలు ఉన్న ఆధ్యాత్మిక కేంద్రం అని వెల్లడించారు. ప్రస్తుతం ఆ చరిత్ర మరుగున పడేలా, దేవాలయాల ఆస్తులు అక్రమార్కులు చేతుల్లోకి వెళ్లాయని అన్నారు. అనేక దేవాలయాలు ప్రస్తుతం దీప, ధూప నైవేద్యాలకు నోచుకోలేక మరుగునపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయాలను నమ్ముకున్న పూజారులు రోడ్డునపడే స్థితిలో ఉన్నారన్నారు. కంఠేశ్వర్ ఆలయ ఆవరణలోని స్థలం మొత్తం ఈరోజు అక్రమార్కుల కేంద్రంగా మారిపోయిందని సూచించారు.

ఇలాంటి తప్పుడు పనులు చేసే వ్యక్తులకు దేవాదాయ శాఖ అధికారులు అండగా నిలవడం మూలంగా, ఈ అవినీతిలో వాళ్లు కూడా ఉన్నారనే అనుమానాలకు తావిస్తోందని ఆరోపించారు. ఇందూరు నగరంలోని మొత్తం ఆలయాల ఆస్తులు, వాటి ఆదాయ వివరాల మీద శ్వేతపత్రం విడుదల చేయాలని, దోపిడీకి అడ్డుకట్ట వేసి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందూరులోని మొత్తం దేవాలయ భూములు, ఆస్తుల వివరాలను ప్రజలకు తెలిసేలా బహిర్గతం చేయాలన్నారు. అన్యాక్రాంతంలో ఉన్న దేవాలయాల స్థలాలను తక్షణమే స్వాధీనం చేసుకోవాలని కోరారు. దేవాదాయ పరిధిలోకి రాని దేవాలయాల్లో రాజకీయ నాయకులు ప్రమేయాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. శంబూనిగుడి చుట్టూ వున్న దుకాణాలను చెప్పుల షాపులను తొలగించాలని, ఆక్రమించిన వ్యక్తుల మీద కేసులు నమోదు చేయాలని కోరారు.

ఇప్పటి నుంచి దేవాలయ ఆస్తులు, షాపింగ్ కాంప్లెక్స్‌ల కాంట్రాక్టు వ్యవస్థను మొత్తం పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ఇదివరకే ఆక్రమణకు గురైన మొత్తం దేవాలయాల ఆస్తులను తిరిగి ఆలయాలకు అప్పజెప్పాలని పేర్కొన్నారు. సరిగ్గా నెలరోజుల్లో ఈ విషయాల పట్ల సరైన చర్యలు తీసుకోవాలని వెల్లడించారు. లేని పక్షంలో ఈ అక్రమాల్లో అధికారుల పాత్రను అనుమానించి దేవాదాయ శాఖ కమిషనర్, మంత్రికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా ఈ విషయాలను నిగ్గు తేల్చేవరకూ మేము మా నిరసనను కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నామన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో హిందువాహిని జిల్లా అధ్యక్షులు అనిల్ కదం, బజరంగ్ దళ్ విభాగ్ ప్రముఖ్ గంగా ప్రసాద్, విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి బోత్ కిషన్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, బంటు ప్రవీణ్, మురారి, ప్రతాప్, రాజు, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed