సాగర్‌లో బీజేపీ బహుముఖ వ్యూహం.. కమలనాథుల మేధో మథనం

by  |
సాగర్‌లో బీజేపీ బహుముఖ వ్యూహం.. కమలనాథుల మేధో మథనం
X

దిశ‌,తెలంగాణ బ్యూరో : సాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ బహుముఖ వ్యూహంతో ముందుకెళ్లాలని నిర్ణయించింది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల కన్నా సాగర్‌లో కొంత ప్రతికూల పరిస్థితులున్న నేపథ్యంలో పక్కా ప్రణాళిక ప్రకారం క్యాంపెయిన్ చేయాలని కమలనాథులు అనుకుంటున్నారు. మంగళవారం రాష్ట్ర పదాధికారులు స్టేట్ ఆఫీస్ లో సమావేశమయ్యారు. ఈ మీటింగ్ లో తెలంగాణ ఇంచార్జ్ తరుణ్ చుగ్, రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఆర్గనైజర్ సెక్రెటరీ మంత్రి శ్రీనివాస్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ పాల్గొన్నారు.

సాగర్ బై ఎలక్షన్స్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై దాదాపు మూడు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా బీజేపీ పలు మండలాల్లో పెద్ద సభలను నిర్వహించింది. అయితే ఈ సారి సాగర్‌లో బూత్/ గ్రామ స్థాయిల్లో కూడా సభలు పెట్టాలని డిసైడైంది.

మామూలుగా ఇతర పార్టీల్లో గ్రామ, మండల కమిటీలు కీలకంగా వ్యవహరిస్తుంటాయి. అయితే బీజేపీలో బూత్ స్థాయి, శక్తీ కేంద్రాలు.. ఆపై మండల కమిటీలు కీలక భూమిక పోషిస్తాయి. 4 నుంచి 5 బూత్ లకు కలిపి శక్తి కేంద్రాలు పని చేస్తాయి. వీటికి అదే మండలానికి చెందిన పక్క శక్తీ కేంద్రాలకు సంబంధించిన వారు ఇంచార్జ్ బాధ్యులుగా ఉంటారు. దీంతో పాటు బయట నుంచి వచ్చిన జిల్లా స్థాయి నాయకులకు స్థానిక ఇంచార్జ్ లను సమన్వయం చేసేందుకు ఎన్నికల టైంలో బాధ్యతలను అప్పగిస్తారు.

అయితే ఈసారి శక్తి కేంద్రాల ఇంచార్జ్ లను సమన్వయం చేసేందుకు రాష్ట్ర స్థాయి నేతలకు బాధ్యతలను అప్పగించాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కీలక నేతలకు శక్తీ కేంద్రాల ప్రచార బాధ్యతలను అప్పగిస్తే.. క్యాడర్ లో కొంత జోష్ వచ్చి క్యాంపెయిన్ లో దూసుకెళ్లవచ్చనే భావనలో కమలనాథులున్నారు. అందుకే మొత్తం బూత్ స్థాయి, శక్తి కేంద్రాలు, మండల, సెగ్మెంట్ గా నాలుగు లేయర్స్ గా విభజించి ప్రచారం చేయాలని ఆలోచనకు నాయకత్వం వచ్చింది.

ఎవరెవరిని ఎక్కడెక్కడ ప్రచారంలో వినియోగించుకుంటే బాగుంటుందనే దానిపై ఆఫీస్ బేరర్ల మీటింగ్ లో చర్చించి నిర్ణయించినట్లు తెలుస్తోంది. పోలింగ్ కు సమయం ఆసన్నమవుతున్నందున రేపటి నుంచే సాగర్ లో స్టార్ క్యాంపెయినర్ల ప్రచారం చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రచారానికి జాతీయ స్థాయి నాయకులు,కేంద్ర మంత్రులను ఆహ్వానించాలనే ఆలోచనలో ఉన్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ వివరాలు బుధవారం ఖరారయ్యే అవకాశం ఉంది.

ఇక దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో జరిగిన ఘటనలు కూడా పదాధికారుల సమావేశంలో చర్చినట్లు తెలుస్తోంది. దుబ్బాక బై పోల్స్ లో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారనే భావన కమలనాథుల్లో ఉంది. అందుకే ఈ సారి అలాంటీ ఘటనలు పునరావృతం కాకుండా సాగర్ నియోజకవర్గం పరిధిలో 3 నుంచి 4 ఏళ్లుగా పనిచేస్తున్న అధికారులను తక్షణమే అక్కడి నుంచి బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్ కు రాష్ట్ర నాయకత్వం ఫిర్యాదు చేసింది. దుబ్బాక ఎలక్షన్స్ టైంలో లా అండ్ ఆర్డర్ పర్యవేక్షుడుగా కేంద్ర ఎన్నికల సంఘం.. ఇతర రాష్ట్రానికి చెందిన ఐపీఎస్ అధికారిని నియమించినట్లే సాగర్ లో ఓ ఐపీఎస్ అధికారికి బాధ్యతలు అప్పగించాలని కోరింది.


Next Story

Most Viewed