పొలిటికల్ పంచ్.. హుజురాబాద్ తూర్పున TRS, పశ్చిమాన BJP.. మరి కాంగ్రెస్?

by  |
Huzurabad-by-election
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఎన్నికల కమిషన్ విధించిన నిబంధనలకు తగ్గట్టుగా వ్యవహరిస్తున్నాయి పొలిటికల్ పార్టీలు. అవకాశాన్ని అందిపుచ్చుకొని రాజకీయ పార్టీలు ఎలక్షన్ కమిషన్ కండీషన్లకు అనుగుణంగా వేదికలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ ఆలోచనతో ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ పరిధిని దాటి సభలు, సమావేశాలు నిర్వహిస్తోంది. తాజాగా ఇదే బాటలో బీజేపీ కూడా ముందుకు సాగాలని భావిస్తోంది. ఇంతకాలం సైలెంట్‌గా ఉన్న కమలనాథులు రెండు రోజులుగా దూకుడు ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో వ్యూహంతో బీజేపీ ముందుకు సాగబోతున్నది.

మొలంగూరు శివారులో..

టీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లాలోని ఎల్కతుర్తి మండలం పెంచికల్‌పేట కేంద్రంగా సభలు, సమావేశాలు నిర్వహిస్తోంది. వివిధ కుల సంఘాల సమావేశాలు చేపట్టిన టీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్ సభను కూడా ఇక్కడే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నెల 27న జరగనున్న సీఎం సభకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ హుజురాబాద్‌కు తూర్పున ఉన్న పెంచికల్‌పేటను ఎంచుకుంటే, బీజేపీ నాయకులు కరీంనగర్ జిల్లాలోని శంకరపట్నం మండలం మొలంగూరు గ్రామాన్ని ఎంచుకున్నారు. మొలంగూరు శివార్లలో సభా వేదికను ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయ్యారు.

ఈ సభా వేదిక వద్ద హుజురాబాద్ నియోజవకర్గంలోని వివిధ కుల సంఘాల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా కేంద్ర మంత్రులతో పాటు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా హుజురాబాద్‌కు వచ్చే అవకాశాలున్నాయి. ఈ మేరకు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్న కారణంగానే బీజేపీ నాయకులు మొలంగూరులో సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

హుజురాబాద్‌కు సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొలంగూరు నుండి సమీకరణాలు చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా బీజేపీ బూత్ కమిటీలు, పార్టీ అంతర్గత సమావేశాలను కూడా ఇక్కడే నిర్వహించుకుంటారని సమాచారం.

Next Story

Most Viewed