గ్రేటర్‌లో గెలుపుకై బీజేపీ సరికొత్త వ్యూహం

by  |
గ్రేటర్‌లో గెలుపుకై బీజేపీ సరికొత్త వ్యూహం
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: బల్దియాపై పట్టు కోసం బీజేపీ తనదైన రీతిలో కార్యాచరణ రూపొందిస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్‌లో స్పీడ్ పెంచి ఇతర పార్టీల ముఖ్య నాయకులపై ఫోకస్ పెడుతోంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ లో అసంతృప్తితో ఉన్న నేతలను తమవైపు తిప్పుకునేందుకు కమలనాథులు వ్యూహాలు రచిస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో కొనసాగిన ప్రచార ఊపును జీహెచ్ఎంసీలో ఎన్నికల్లోనూ కొనసాగిస్తూ.. క్రమంగా బలం పెంచుకునేందుకు ప్రణాళికలు చేస్తోంది. టీఆర్ఎస్, మజ్లీస్ ఒకవైపు.. బీజేపీ మరోవైపు అన్న తీరులో రాజకీయ సమీకరణలను మార్చేందుకు ఆ పార్టీ పెద్దలు సిద్ధమవుతున్నారు.

బల్దియా ఎన్నికలు దగ్గర పడుతుండటంతో జీహెచ్ఎంసీలో ఈసారి ఎలాగైనా బీజేపీ సత్తా చాటాలనుకుంటోంది. గ్రేటర్‌లో అన్ని వార్డులు కవరయ్యేలా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. గ్రేటర్‌లో బలమైన కేడర్ ఉన్నా.. బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇన్‌చార్జిలను నియమించారు. మహంకాళి-సికింద్రాబాద్‌కు బి.శ్యాంసుందర్ గౌడ్, బర్కత్ పుర- అంబర్ పేటకు డాక్టర్ ఎన్.గౌతమ్ రావు, గోల్కొండ- గోషామహల్‌కు వి.పాండుయాదవ్, భాగ్యనగర్ -మలక్‌పేటకు సమ్‌రెడ్డి సురేందర్ రెడ్డితోపాటు జీహెచ్ఎంసీలోనే అంతర్భాగమైన రంగారెడ్డి అర్బన్‌కు సామ రంగారెడ్డి, మేడ్చల్ అర్బన్‌కు సంబంధించి పన్నాల హరీశ్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. ఓ వైపు కేంద్ర సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై ప్రచారం నిర్వహిస్తూనే.. మరో వైపు టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టాలని జీహెచ్ఎంసీ పరిధిలో నూతనంగా ఎంపికైన ఆరుగురు అధ్యక్షులకు ఇప్పటికే పార్టీ పెద్దలు దిశా నిర్దేశం చేశారు.

ఆపరేషన్ ఆకర్ష్ స్పీడప్..

గ్రేటర్ ఎన్నికల్లో 150 సీట్లకు గానూ ఎలాగైనా 75కు పైగా స్థానాల్లో విజయం సాధించాలని టార్గెట్‌గా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఇతర పార్టీలకు చెందిన కొందరు రాష్ట్రస్థాయి నేతలు ఇప్పటికే బీజేపీ‌లో చేరగా.. మరికొందరు అదే బాటపట్టినట్టు సమాచారం. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ విజయశాంతి కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ నెల 26వ తేదీన బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందుకు బలం చేకూరుస్తూ విజయశాంతి కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలపై మాట్లాడడం కారణంగా చెప్పవచ్చు. ఇటీవలే విజయశాంతి ఇంటికి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాకూర్ వెళ్లి స్వయంగా చర్చలు జరిపిన విషయం విధితమే. అయితే మాణిక్యం కొద్దిగా ముందు వచ్చి ఉంటే బాగుండు.. అన్నట్లు తెలిసింది. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కూడా టీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరనున్నట్టు ప్రచారం జరుగుతోంది. మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పోసగం లేనందునే పార్టీని వీడుతున్నట్లు సమాచారం. దీంతో తీగల కృష్ణారెడ్డి బంధువైన మంత్రి మల్లారెడ్డితో పాటు పలువురు నేతలు బుజ్జగించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌తో మాట్లాడించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా రాజేంద్రనగర్ కార్పొరేటర్ బీజేపీలో చేరుతున్నట్లు ఇప్పటికే ప్రకటించగా,ఆయన బాటలో పలువురు టీఆర్ఎస్ కార్పొరేటర్లు సైతం బీజేపీ ముఖ్యనేతలతో ఇప్పటికే టచ్‌లో ఉన్నట్టు తెలిసింది.రేపటి దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వస్తే వలసలు మరింత పెరిగే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కమలం గూటికి కంటోన్మెంట్ నేతలు..

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో ఆదివారం కంటోన్మెంట్ నేతలు బీజేపీలో చేరారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జె.రామకృష్ణ, భానుక నర్మద, బోర్డు మాజీ సభ్యురాలు జె.అనురాధ, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు భానుక మల్లికార్జున్, బణాల శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ తోపాటు వందలాది మంది టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ముందుగా రామకృష్ణ, భానుక మల్లీకార్జున్ కంటోన్మెంట్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొని కార్యకర్తలను ఉత్తేజపరిచారు. కంటోన్మెంట్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని, కంటోన్మెంట్ కు రాష్ట్ర ప్రభుత్వం నయాపైసా ఇవ్వలేదని, బోర్డుకు ఇవ్వాల్సిన డబ్బులతోనే రాష్ట్ర సర్కారు వడ్డీ వ్యాపారం చేస్తుందని సభలో బీజేపీ నేతలు ధ్వజమెత్తారు. వచ్చే జీహెచ్ఎంసీ, కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో బీజేపీ జెండాను ఎగురవేద్దామంటూ ఓ పక్క ఎన్నికల ప్రచారానికి ఇక్కడి నుంచే శంఖం పూరించారు.

గ్రేటర్‌లో సత్తా చాటుతాం..

గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతాం. ఇప్పటికే పార్టీ నాయకత్వం ఆ దిశగా వ్యుహరచన చేస్తుంది. టీఆర్ఎస్ గత ఎన్నికల్లో 99 సీట్లు గెలుపొందినా.. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను విస్మరించిన విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతాం. కేంద్ర ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రచారం చేస్తాం. 75కు పైగా కార్పొరేట్ స్థానాలను కైవసం చేసుకొని గ్రేటర్‌పై బీజేపీ జెండా ఎగురవేస్తాం.

– రాంచందర్ రావు, ఎమ్మెల్సీ, నగర మాజీ అధ్యక్షుడు

Next Story