అత్యాచారాలకు అడ్డాగా తెలంగాణ.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

110
BJP MLA Raja singh

దిశ ప్రతినిధి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ గడ్డ అత్యాచారాలకు అడ్డాగా మారిపోయిందని అన్నారు. ప్రభుత్వాన్ని నడిపేది టీఆర్ఎస్ అయినప్పటికీ స్టీరింగ్ మాత్రం ఎమ్ఐఎమ్ చేతుల్లో ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పోలీసు అధికారులు ప్రమోషన్‌లకు ఆశపడి, అధికార పార్టీ మెప్పు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. పోలీస్ శాఖ ‘లా అండ్ ఆర్డర్‌’ను పూర్తిగా గాలికొదిలేసిందని మండిపడ్డారు. చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. అతనిది హత్యా? ఆత్మహత్యా? అనే అనుమానాలు ప్రజల్లో ఉన్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.

సైదాబాద్ చిన్నారి ఘటన మరువకముందే, హబీబ్‌నగర్ పీఎస్ పరిధిలో మరో తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారయత్నం జరిగిందని, అసలు రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనిచేస్తోందా? అని ప్రశ్నించారు. తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ కమిషనర్ ఇతర పనుల్లో బిజీగా ఉన్నారని, ‘హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను ఏ విధంగా గెలిపించాలి. ప్రతిపక్షాల ఫోన్‌లు ఏ విధంగా ట్యాప్ చేయాలి. బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరిని కలుస్తున్నారు.’’ అనే సమాచారం మొత్తం కేసీఆర్‌కు చేరవేసే పనుల్లో బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కొంతమంది పోలీసులు గులాంగిరీ చేస్తున్నారని, కానీ, కొంతమంది పోలీసులు నిజాయితీగా పనిచేస్తున్నారని వారికి నా సెల్యూట్ అని అన్నారు.

హిందువుల పండుగలు జరిగితే సుప్రీంకోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయని వాపోయారు. గో రవాణా చేయొద్దని సుప్రీంకోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నా.. ఆగడం లేదని వాపోయారు. వినాయక చవితి ఉత్సవాలు రాష్ట్రంలో పూర్తిగా అంతం చేయాలని ఎమ్‌ఐఎమ్ కల కంటోందని, ఆ కలను నిజం చేయాలనే కుట్రలో భాగమే నిమజ్జనాలను అడ్డుకోవడం అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ నేతలు విచ్చలవిడిగా ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారని, కబ్జాకు గురైన భూములను స్వాధీనం చేసుకుని అందులో నిమజ్జనానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎమ్ఐఎమ్ పార్టీ ఆదేశాలకు తలొగ్గి టీఆర్ఎస్ నేతలందరూ సైలెంట్ అవుతున్నారని, ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు. ధర్మం పట్ల అధర్మంగా వ్యవహరిస్తే సర్వనాశనమై పోతారనేది సీఎం కేసీఆర్ గుర్తుంచుకోవాలని రాజాసింగ్ సూచించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..