కాణిపాకం రా.. వైసీపీ ఎమ్మెల్యేకు బీజేపీ నేత విష్ణువర్థన్‌రెడ్డి సవాల్

by  |
YCP MLA
X

దిశ, ఏపీ బ్యూరో: బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డిల మధ్య నెలకొన్న వివాదం రాజుకుంటుంది. కడప జిల్లా ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు నేపథ్యంలో ఇరువురు మధ్య రాజకీయ విబేధాలు చోటు చేసుకున్నాయి. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం టిప్పుసుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారని విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. అంతేకాదు ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి హింసను ప్రేరేపిస్తున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

విష్ణువర్థన్‌రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రాచమల్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. విష్ణువర్ధన్ రెడ్డి పెద్ద దొంగ అని, పుట్టపర్తి సాయిబాబా ఆశ్రమంలో డబ్బు, బంగారం దోచేశాడంటూ ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రాచమల్లు ఆరోపణలపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. ఆరోపణలపై ఈ నెల 10న కాణిపాకం వినాయక ఆలయంలో ప్రమాణం చేద్దాం రా అంటూ సవాల్ విసిరారు.

ఆగస్టు 10 ఉదయం 11 గంటలకు కాణిపాకంలో స్వామివారి సన్నిధికి తాను వస్తానని.. ఎమ్మెల్యే రాచమల్లు వచ్చి ఆరోపణలపై ప్రమాణం చేయాలని స్పష్టం చేశారు. ఒకవేళ ఆ రోజు రాకపోతే శివప్రసాద్‌రెడ్డి రాజకీయ భవిష్యత్తును సమాజమే నిర్ణయిస్తుందని హెచ్చరించారు. శివప్రసాద్ రెడ్డి వచ్చినా, రాకపోయినా తాను మాత్రం కాణిపాకం వచ్చి దేవుడి ముందు తన నిజాయతీ నిరూపించుకుంటానని విష్ణువర్థన్ రెడ్డి స్పష్టం చేశారు.



Next Story