బోనాల చెక్కుల పంపిణీలో ఉద్రిక్తత.. ఆలయం మూసివేత

by  |
BJP-and-TRS-leaders-clashed
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: ముషీరాబాద్‌లో బోనాల చెక్కుల పంపిణీ వివాదానికి దారి తీసింది. టీఆర్ఎస్, బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్ధం చివరకు ఒకరిని ఒకరు తోసుకునే స్థాయికి చేరుకుంది. ఆవేశం పట్టలేక రెండు పార్టీల నాయకులు పరస్పరం కుర్చీలు విసురుకున్నారు. టీఆర్ఎస్ నాయకులు జై తెలంగాణ అంటూ.. బీజేపీ నాయకులు జై శ్రీరామ్ అంటూ భారీ ఎత్తున నినాదాలు చేశారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను అక్కడి నుండి పంపించి వేయడంతో చెక్కుల పంపిణీ కూడా నిలిచిపోయింది.

వివరాళ్లోకి వెళితే.. ముషీరాబాద్ పరిధిలోని బోలక్ పూర్ డివిజన్ దేవునితోట శ్రీ భవాని శంకర ఆలయం ప్రాంగణంలో మంగళవారం అధికారులు బోనాల ఉత్సవాలకు సంబంధించిన చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఠా గోపాల్, దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ , ఈఓ జీఏకే కృష్ణలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో 173 దేవాలయాలకు రూ. 90 లక్షలు మంజూరయ్యాయని, వాటిని ఆలయ కమిటీ ప్రతినిధులకు అందజేస్తున్నామని తెలిపారు. మూడు దేవాలయాలకు ఆయన చెక్కులు పంపిణీ చేసిన అనంతరం మరో కార్యక్రమంలో పాల్గొనాలంటూ అక్కడి నుండి వెళ్లి పోయారు. అనంతరం దేవాదాయ శాఖ ఏసీ కృష్ణ చెక్కులను పంపిణీ చేస్తుండగా.. బీజేపీ నేతలు వేదిక వద్దకు వచ్చి, బీజేపీ కార్పొరేటర్లకు సమాచారం ఇవ్వకుండా చెక్కుల పంపిణీ ఎలా చేస్తారని ప్రశ్నించారు.

దీంతో అక్కడే ఉన్న టీఆర్ఎస్ నాయకులు కల్పించుకున్నారు. ఇరు పార్టీల నేతల మధ్య మాటా మాటా పెరిగి, వాగ్వాదానికి దారి తీసింది. ఆగ్రహంతో ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు. దీంతో సుమారు డజను కుర్చీలవరకూ విరిగిపోయాయి. అనంతరం బీజేపీ నాయకులు ఆలయ ప్రాంగణంలో ధర్నా చేశారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు సైతం అక్కడే బైఠాయించి వారు కూడా ధర్నా నిర్వహించారు. ఇరువురు పోటాపోటీ నినాదాలు చేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం సమాచారం అందుకున్న చిక్కడపల్లి ఏసీపీ శ్రీధర్, ముషీరాబాద్ ఇన్ స్పెక్టర్ జహంగీర్ యాదవ్, ఎస్ఐ వెంకట్ రెడ్డి సిబ్బందితో ఆలయానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఇరుపార్టీల నాయకులను అక్కడి నుండి పంపించి, అనంతరం పోలీసులు ఆలయాన్ని మూసివేశారు.

సమాచారం ఇచ్చినా రాలేదు : ఎమ్మెల్యే ముఠా గోపాల్

బోనాల చెక్కుల పంపిణీకి హాజరుకావాలని బీజేపీ కార్పొరేటర్లకు సమాచారం ఇచ్చినా వారు రాలేదని, చివర్లో వచ్చి మాకు ఆహ్వానం లేదని గొడవకు దిగడం శోచనీయని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. పండుగలు అందరూ కలిసి మెలిసి జరుపుకోవాలని, ఇలా గొడవలకు దిగడం సరికాదన్నారు.

Next Story

Most Viewed