మాటల మాంత్రికుడికి అర్ధ శతాబ్ది..

by  |
trivikram
X

దిశ, సినిమా : మాటల రచయితగా మొదలుపెట్టి, ఎదురొచ్చిన ప్రతీ అవకాశాన్ని ఒడిసిపట్టుకుని టాప్ డైరెక్టర్‌గా ఎదిగే వరకు ఆయన సినీ జర్నీ యువ దర్శకులకు స్ఫూర్తిదాయకం. కాసింత చోటు దొరికితే చాలు.. కమర్షియల్ సినిమాలోనూ కళాత్మకత చూపెట్టగల ఆయన విద్వత్తు ప్రతీ టెక్నీషియన్‌కు అనుసరణీయం. తెలుగు భాష మీద మమకారం, సాహిత్యంపై పట్టు, విలువలతో కూడిన చిత్రీకరణ డైరెక్టర్‌గా ఆయన స్థాయిని పెంచితే.. కథ కోసం నేల విడిచి సాము చేయకపోవడమే ఆయన సినిమాకు విలక్షణత తీసుకొచ్చింది. బరువైన సన్నివేశాన్ని కూడా తేలికైన మాటలతో ముగించేసి, ప్రేక్షకుడిని కన్విన్స్ చేయగల నేర్పరితనమే ఆయనకు మాటల మాంత్రికుడనే బిరుదును తెచ్చింది. ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలకు కట్టుబడి ఉండటమే ఆయన నైజం కాగా.. తన కథల్లోని హీరో హీరోయిన్ల పాత్రలు సైతం చాలావరకు సగటు మధ్యతరగతి జీవితాలనే ప్రతిబింబిస్తుంటాయి. కన్ఫ్యూజింగ్ స్క్రీన్‌ప్లే, అసహనానికి గురిచేసే పజిల్స్‌కు తావు లేకుండా ప్రేక్షకుడికి రెండున్నర గంటల పాటు వినోదాన్ని పంచడమే ఆయన స్టైల్. ఆయన డైరెక్షన్‌లో ఒక్క సినిమా అయినా చేయాలనేది ప్రతీ నటుడి కల. అతడే త్రివిక్రమ్ శ్రీనివాస్.. నేడు తన 50వ పుట్టినరోజు సందర్భంగా కొన్ని విశేషాలు..

ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరంలో పుట్టి పెరిగిన త్రివిక్రమ్.. న్యూక్లియర్ ఫిజిక్స్‌లో గోల్డ్ మెడలిస్ట్. కానీ సినిమాల మీదున్న ఇష్టంతో బ్రైట్ ఫ్యూచర్‌ను వదిలిపెట్టి హైదరాబాద్ వచ్చేశాడు. ‘స్వయంవరం, నువ్వే కావాలి, చిరునవ్వుతో, నువ్వు నాకు నచ్చావ్, వాసు’ వంటి చిత్రాలకు డైలాగ్ రైటర్‌గా పనిచేసి మంచి పేరు సంపాదించాడు. ఇక 2002లో ‘నువ్వే నువ్వే’ చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేసిన తనకు మళ్లీ వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఇదే క్రమంలో 2005లో మహేశ్ బాబుతో తెరకెక్కించిన ‘అతడు’ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచినా త్రివిక్రమ్ టేకింగ్‌కు ఫుల్ మార్క్స్ పడ్డాయి. ఫ్యామిలీ ఆడియన్స్ ఎంజాయ్ చేసేలా క్యూట్ కామెడీతో చిత్రాలు తెరకెక్కించడం ఆయన స్పెషాలిటీ.

ఈ క్రమంలోనే ‘జల్సా, ఖలేజా, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, అ ఆ, అరవింద సమేత, అల.. వైకుంఠపురములో’ సినిమాలతో ఒక్కో మెట్టు ఎక్కుతూ అగ్రదర్శకుడిగా మన్ననలు అందుకుంటున్నాడు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబుతో కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాడు.



Next Story

Most Viewed