ఆనాటి నెత్తుటి మరకలకు 72ఏళ్లు..

by  |
ఆనాటి నెత్తుటి మరకలకు 72ఏళ్లు..
X

దిశ, హుస్నాబాద్:

ఆనాడు రాజకార్ల రాచరిక పాలనకు వీరోచితంగా పోరాడిన వీర బైరాన్ పల్లి నెత్తుటి మరకలకు నేటితో 72ఏళ్లు నిండాయి. దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చినా హైదారాబాద్ సంస్థానం నిజాం కబంధహస్తాల్లోనే ఉండిపోయింది. ఆ సమయంలో రాజకార్ల పై ప్రజలు, కమ్యూనిస్టులు చేస్తున్న తీరుగుబాటును అణచివేయడానికి కాశీంరజ్వీ మిలిటెంట్లను తయారు చేశాడు. 1948 ఆగస్టు 27న నాటి ఓరుగల్లు (వరంగల్) జిల్లా, ప్రస్తుత సిద్దిపేట జిల్లా మద్దూర్ మండలంలోని బైరాన్‌పల్లి గ్రామంలో రజాకార్లు నరమేధం సృష్టించారు.

ఈ సాయుధ పోరులో 118 మంది వీరమరణం పొందారు. దేశ చరిత్రలోనే ఈ ఘటన మాయని మచ్చగా నిలిచినా.. భవిష్యత్ తరాలకు అది స్ఫూర్తి దాయకంగా నిలిచింది. రజాకార్లు గ్రామాలపై దాడులకు పాల్పడుతూ.. ఊళ్లకు ఊళ్లే తగలబెట్టారు. అంతేకాకుండా ఎంతోమంది స్త్రీలను చెరబట్టారు.

సాయుధ పోరాటం తర్వాత ‘బైరాన్‌పల్లి’ పేరు వింటేనే రజాకార్లు, నిజాం సైన్యాలు వణికిపోయేవి. ఆ గ్రామంలో పిల్లల నుంచి పడుచు యువతుల దాకా.. అంతా ఒక్కటై నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. నిజాం చీకటి పాలన నుంచి ఎలాగైనా బయటపడి భారత యూనియన్‌లో ప్రజాస్వామిక స్వేచ్ఛా గాలులు పీల్చాలని ప్రతి గుండె, ప్రతిగ్రామం తహతహలాడుతూ హైదరాబాద్ సంస్థానాన్ని ఎదురించిన కాలమది.

నాటి పోరాట స్పూర్తిని తలుచుకుంటూ ఎందరో ఉద్యమకారులు తెలంగాణ మలిదశ ఉద్యమంలో కూడా ముందుకు సాగారు. స్వరాష్ట్రం సిద్దిస్తేనే నాటి చరిత్ర పదిలం అవుతుందని అభ్యుదయ వాదులు, ఉద్యమకారులు, యువకులు, పలు గ్రామస్తులు భావించారు. స్వరాష్ట్రం సిద్దించాక నాటి పోరాట స్మృతులను, రక్తపు మడుగుల చరిత్రను నేటి పాలకులు గుర్తుంచుకుంటారని చరిత్రకారులు ఆశాభావం వ్యక్తంచేశారు.కాగా, ఆ చరిత్రను కనుమరుగు చేసేందుకు తెలంగాణ పాలకులు కుట్ర చేస్తుండటంతో నేటి తరం యువత, విద్యవంతులు, అభ్యుదయవాదులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

Next Story

Most Viewed