కాంగ్రెస్‌ను ఇంకెన్నాళ్లు మోయాలి: భిక్షపతి యాదవ్

by  |
కాంగ్రెస్‌ను ఇంకెన్నాళ్లు మోయాలి: భిక్షపతి యాదవ్
X

దిశ, వెబ్‌డెస్క్: శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన కాంగ్రెస్‌ పై సంచలన వ్యాఖ్యలు చేస్తూనే భారతీయ జనతా పార్టీ పై ప్రశంసలు కురిపించారు. ఇంకా ఎన్నాళ్లు ఈ కాంగ్రెస్ పార్టీని మోయాలని అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ కాంగ్రెస్‌లో అనైక్యత ఎక్కువైందన్నారు. కీలక నాయకులు గ్రూపులుగా డివైడ్ కావడంతో పార్టీలో క్రమశిక్షణ తప్పిందని భిక్షపతి యాదవ్ అసహనం వ్యక్తం చేశారు.

అలాగే, తన కొడుకు రవికుమార్ యాదవ్‌‌కు స్టేట్ యూత్ కాంగ్రెస్ ఇస్తామని హామీ ఇచ్చి చివరకు మాట తప్పారని ఆరోపించారు. కొంతమంది అడ్డంకులు సృష్టించారన్నారు. తగిన ప్రాధాన్యత ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇవ్వలేదన్నారు. కానీ బీజేపీ పార్టీ మాత్రం తగు ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. దీనికి తోడు దేశం మొత్తం మోదీ నాయకత్వం నడుస్తోందని అభిప్రాయపడ్డారు. ఇక బీజేపీలో చేరితే నియోజకవర్గానికి కూడా తగు అభివృద్ధి జరగుతోందని ఆయన ఆకాంక్షించారు. అలాగే, నియోజకవర్గంలోని మైనార్టీలు మొత్తం తమ వెంటే ఉన్నారని భిక్షపతి యాదవ్ చెప్పుకొచ్చారు. వారికెప్పుడూ రుణపడి ఉంటానని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.

కాగా, ఈ రోజు ఉదయం కాంగ్రెస్ కీలక నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి తదితర సీనియర్ నాయకులు భిక్షపతి యాదవ్ ఇంటికొచ్చి చర్చలు జరిపినా అవి విఫలం అయిన సంగతి తెలిసిందే. దీనికి తోడు సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజనీకుమార్ యాదవ్‌ కూడా పార్టీ పై అసంతృప్తిగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. తీరా జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగలడంతో పార్టీ కీలక నేతలకు సైతం తలనొప్పిగా మారిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Next Story

Most Viewed