విశ్వాసం సన్నగిల్లిన వినియోగదారులు

by  |
విశ్వాసం సన్నగిల్లిన వినియోగదారులు
X

బెంగళూరు, హైద్రాబాద్ వంటి మహానగరాల్లో ట్రాఫిక్‌తో నిండిపోయిన రోడ్ల మీద నాలుగు చక్రాల వాహనాల్లో ప్రయాణించడం కంటే నడిచి వెళ్లడం ఉత్తమమని అందరూ అనుకుంటారు. కానీ నడిచి వెళ్లలేరు. అలాంటపుడు సులువైన మార్గం బైకులు. కానీ అందరికీ అన్ని సమయాల్లో బైక్ అవసరముండదు. ఈ ఐడియాను సార్థకం చేస్తూనే అవసరానికి బైక్ అద్దెకు ఇచ్చే సంస్థలు పుట్టుకొచ్చాయి. యాప్ ద్వారా బైక్ అద్దెకు ఇచ్చి, ప్రయాణం పూర్తికాగానే బైక్‌ని అక్కడే వదిలేసి వెళ్లే సౌకర్యాన్ని ఈ సంస్థలు కల్పిస్తున్నాయి. కానీ వినియోగదారులు మాత్రం ఆశించినంత విశ్వాసాన్ని చూపించడం లేదని సంస్థల యాజమాన్యాలు అంటున్నాయి.

బైకుల ధ్వంసం, విడిభాగాల చోరీ

ప్రస్తుతం అద్దె బైకు సేవలనందిస్తోన్న బౌన్స్, యులూ సంస్థలకు వారి సేవలను అందుకున్న వినియోగదారులు బైకులను ధ్వంసం చేయడమో లేక విడిభాగాలను ఎత్తుకెళ్లిపోవడమో చేస్తున్నారని వాపోతున్నారు. అంతేకాకుండా జీపీఎస్‌కి చిక్కని చోట్లలో బైకులను వదిలేయడం, హెల్మెట్ దొంగిలించడం, విచ్చలవిడిగా డ్రైవ్ చేయడం వంటి సమస్యలు కూడా వాళ్లు ఎదుర్కొంటున్నారు.

సమస్యల పరిష్కారమెలా?

ఈ సమస్యల పరిష్కారం కోసం బ్లూటూత్ అనుసంధానం చేసిన హెల్మెట్లను ఇవ్వబోతున్నారు. హెల్మెట్‌ను తిరిగి సంబంధిత సంస్థ ప్రతినిధికి అందజేసినపుడే ట్రిప్ ఎండ్ అయ్యేలా చేయబోతున్నట్లు బౌన్స్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. అంతేకాకుండా విచ్చలవిడిగా డ్రైవ్ చేసిన వారికి, విడిభాగాలు, హెల్మెట్లు దొంగిలించిన వారిని బ్లాక్‌లిస్టులో పెడుతున్నారు. అలాగే వారికి కొంత జరిమానా కూడా విధిస్తున్నారు.

అయితే ప్రతిరోజు లక్షల మందికి సాయం అందించే తమ సంస్థలు బ్లాక్‌లిస్టు విధానాన్ని అమలు చేయడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో వినియోగదారులు ఇబ్బంది పడే అవకాశముందని సంస్థల ప్రతినిధులు అంటున్నారు.

పోలీసుల సాయం?

బైకు దొంగతనాలను, విడిభాగాల చోరీని అరికట్టడానికి బెంగళూరు, హైద్రాబాద్ నగరాల్లో బౌన్స్ సంస్థ పోలీసుల సాయం తీసుకోబోతోంది. విచ్చలవిడిగా డ్రైవ్ చేసినవారిని, బైకులు ఎక్కడపడితే అక్కడ పార్క్ చేసిన వారిని పోలీసు వ్యవస్థ సాయంతో గుర్తించనుంది. అంతేకాకుండా తమకు సాయం చేయడానికి ప్రభుత్వాలు కూడా సిద్ధంగా ఉన్నాయని బౌన్స్ ప్రతినిధులు వెల్లడించారు. ఇది కాకుండా విడిభాగాల దొంగతనాన్ని అరికట్టడానికి కేవలం తమ బైకులకే సరిపోయే నట్లు, బోల్టులు, టైర్లను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.

సామాజిక అవగాహన అవసరం

పాశ్చాత్య దేశాల్లో ఇలా బైకులు అద్దెకిచ్చే విధానం ఎప్పట్నుంచో అందుబాటులో ఉంది. అయితే ఇలాంటి విధానం భారతీయులకు కొత్త. అంతేకాకుండా సామాజిక అవగాహన లేమి, పెరిగిన పరిస్థితుల దృష్ట్యా ఇతరుల ఆస్తులను దుర్వినియోగం చేయకూడదనే బుద్ధి కుశలత చాలా మందిలో లేదు. కాబట్టి ఈ అంశం గురించి ముందుగా అవగాహన చేపడితే ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చని మానసిక వైద్య నిపుణులు అంటున్నారు.



Next Story

Most Viewed