ప్రజల పక్షానా మాట్లాడితే నిర్బంధమా !: భట్టి

by  |
bhatti vikramarka
X

దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రంలో ఇంత అనాలోచిత పాలన ఎప్పుడూ చూడలేదని, ప్రజల పక్షాన ఏం మాట్లాడినా నిర్బంధిస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. కనీసం ప్రజాప్రతినిధులను కలిసే అవకాశం లేదని, కలిసేందుకు వెళ్తే కూడా అరెస్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ బిల్లులు, పేదల కష్టాలపై కాంగ్రెస్ పార్టీ ఛలో సెక్రటేరియేట్ పిలుపునిచ్చిన నేపథ్యంలో గురువారం కాంగ్రెస్ పార్టీ నేతలంను ఇండ్లకే పరిమితం చేస్తూ పోలీసులు గృహ నిర్బంధం చేశారు. సీఎల్పీ నేత భట్టి, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, ఎంపీలు కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డితో పాటు చాలా ప్రాంతాల్లో నేతలను గృహ నిర్బంధంలో పెట్టారు.. అంతకు ముందు వీహెచ్, శ్రీధర్‌బాబును అరెస్ట్ చేశారు. నేతల ఇండ్ల దగ్గర పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. భట్టి విక్రమార్క సచివాలయానికి వెళ్లేందుకు తన ఇంటి నుంచి బయటకు రావడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని వెనక్కి పంపించారు. ఈ సందర్భంగా భట్టి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన కొనసాగుతుందని ఆరోపించారు. సచివాలయం ముట్టడించేందుకు కాంగ్రెస్ పార్టీ పిలుపు ఇవ్వలేదని, కేవలం సీఎం కేసీఆర్‌ను కలిసి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ విషయం పోలీసులకు ఎంత చెప్పినా అర్థం చేసుకోలేదని, గృహ నిర్బంధం చేశారన్నారు. విద్యుత్తు బిల్లులు, నియంత్రిత సాగు విధానం, కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సీఎంను కలిసి చర్చించేందుకు అనుమతి కోరామని, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఉదయం 10 గంటలకు కలిసేందుకు అవకాశం ఇచ్చారని, అయినా పోలీసులు బయటకు వెళ్లకుండా గృహ నిర్బంధంలో ఉంచారన్నారు. ప్రభుత్వాన్ని అడిగినందుకు మమ్ములను అరెస్ట్ చేస్తున్నారని, ఒక ప్రజాప్రతినిది హోదాలో సెక్రటేరియట్ వెళ్లి వినతి పత్రం ఇవ్వడం నా హక్కు అని భట్టి పేర్కొన్నారు. హక్కులను, బాధ్యతను అడ్డుకున్న వారికి అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్ ఇస్తానని భట్టి చెప్పారు.

నిరంకుశ పాలన సాగిస్తున్నారు: ఎంపీ కోమటిరెడ్డి

రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నిరంకుశ పాలన సాగిస్తున్నారని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. కరోనా సమయంలో లాక్‌డౌన్ విధించి అద్దె కూడా చెల్లించవద్దన్నారని, ఇప్పుడు స్లాబుల పేరుతో కరెంట్‌కు అధిక బిల్లులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. కరోనా కష్టకాలంలో ప్రజలపై కక్ష సాధింపు చర్యలు ఎందుకని ప్రశ్నించారు. మూడు నెలలుగా ఉపాధి లేని ప్రజలు కరెంట్ బిల్లుల భారాన్ని ఎలా మోస్తారని, ప్రజా సమస్యలపై పోరాడితే అరెస్ట్ చేస్తున్నారని వెంకట్ రెడ్డి ఆక్షేపించారు.

ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారు: వీహెచ్

సీఎం కేసీఆర్ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారని, బోనాలు ఇంటి దగ్గర పెట్టుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయం ప్రజా వ్యతిరేకమని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ అన్నారు. కొండపోచమ్మ ప్రాజెక్టు దగ్గర పూజలు చేసిన సీఎం కేసీఆర్ కరోనా నిబంధనలు పాటించారాన అని ప్రశ్నించారు. మద్యం షాపులకు అనుమతి ఇచ్చిన సీఎం కేసీఆర్ బోనాలకు అనుమతి ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు.

Next Story

Most Viewed