భద్రాద్రి రామయ్య భక్తులకు తప్పని తిప్పలు.. పట్టించుకోని అధికారులు..

by  |
భద్రాద్రి రామయ్య భక్తులకు తప్పని తిప్పలు.. పట్టించుకోని అధికారులు..
X

దిశ, భద్రాచలం టౌన్ : భద్రాచలంలో గోదావరి వద్ద వరద తగ్గి బురద మిగిలింది.‌ బురద కూపాలుగా మారిన భద్రాచల రామాలయం స్నానఘట్టాలతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భద్రాచలం దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధిగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం. భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారి దర్శనానికి దేశ, విదేశాల నుంచి భక్తులు భారీగా తరలివస్తుంటారు. సుందర భద్రాద్రిగా భక్తులను ఆకట్టుకోవాల్సిన పట్టణాన్ని పట్టించుకునేవారు కరువైనట్లుగా స్థానిక పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయి. పలుచోట్ల రోడ్లపై చెత్తాచెదారం కుప్పలుగానే దర్శనమిస్తోంది.‌

దోమలు, ఈగలు వృద్ధిచెంది రోగాలు ప్రబలుతాయని పట్టణ ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.‌ ఇంకోవైపు గోదావరి చెంత భక్తులు బురదలో అవస్థలు పడుతున్నారు. గోదావరి తగ్గగానే స్నానఘట్టాల దగ్గర భక్తుల సౌకర్యార్థం శుభ్రం చేయించాల్సిన గ్రామపంచాయతీ వారు, పట్టించుకోకపోవడంతో పరిసరాల్లోని దుకాణదారులే బురద తొలగించి శుభ్రం చేసుకుంటున్నారు. భక్తులు పంచాయతీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పట్టణ పారిశుద్ద్యంపై గ్రామపంచాయతీ వారు ఇప్పటికైనా దృష్టి పెట్టాలని భద్రాద్రివాసులు ముక్తకంఠంతో కోరుతున్నారు.

=


Next Story

Most Viewed