ఢిల్లీ పీఠంపై పందెం @ 5,000 కోట్లు?

by  |
ఢిల్లీ పీఠంపై పందెం @ 5,000 కోట్లు?
X

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. నిన్న మొన్నటి వరకు లౌడ్ స్పీకర్లతో హోరెత్తిన ఢిల్లీ వాసులకు రెండు రోజుల క్రితం నుంచి శబ్ద కాలుష్యం నుంచి విముక్తి కలిగింది. నేటి ఉదయం వరకు ప్రలోభాల పర్వం కొనసాగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ పార్టీలు విజయం ఖర్చుపెట్టినట్టు తెలుస్తోంది.

నేటి ఉదయం నుంచి సీన్ మారింది. అంతా లోపాయకారీగా జరుగుతోంది. ఆప్, బీజేపీ పోటాపోటీగా పోలింగ్ బూత్ మేనేజ్మెంట్ చేపట్టాయి. దీంతో గెలుపు తమదంటే తమదేనని రెండు పార్టీలు బల్లగుద్దిమరీ చెబుతున్నాయి. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ బీహార్, యూపీ ఓటర్లపై ఆశలు పెట్టుకుని, 56 సీట్లు తమవేనని చెప్పారు. మరోవైపు అమిత్ షా ఎవరూ ఊహించని ఫలితాలు వస్తాయని జోస్యం చెప్పారు.

బీజేపీ నేతలు బీరాలు పలుకుతుంటే.. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మాత్రం విజయం ఖాయమన్న ధీమాతో ఉన్నారు. గతంలో తాము చేసిన పనులే తమను గెలిపిస్తున్నాయని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎన్నికలు ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను మీడియా సంస్థలు వెల్లడించాయి. రిపబ్లిక్ టీవీ మినహా మిగిలిన సంస్థలు ప్రకటించిన అంచనాల ఫలితాల ప్రకారం ఢిల్లీ పీఠం మరోసారి ఆమ్ ఆద్మీ పార్టీదేనని స్పష్టమవుతోంది.

ఢిల్లీని దక్కించుకుని నిరసనలు, ఆందోళనలకు చరమగీతం పాడాలని బీజేపీ అస్త్రశస్త్రాలన్నీ ప్రయోగించింది. యూపీ నుంచి యోగిని రప్పించి ప్రచారం చేయించింది. పంజాబ్ నుంచి సన్నీడియోల్ ను రప్పించింది. భోజ్‌పురీ సినీ పరిశ్రమకు చెందిన పలువురు స్టార్లను రంగంలోకి దించింది. అయితే బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆప్ ముందు ఆ పార్టీ ఆటలు సాగలేదని సర్వేలు తేటతెల్లం చేస్తున్నాయి.

ప్రచారం హోరాహోరీగా సాగడానికి తోడు ఆప్ ను గద్దెదించుతామన్న బీజేపీ బీరాల నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీలో విజయం సాధించే పార్టీపై భారీ స్థాయిలో బెట్టింగ్ లు జరిగినట్టు తెలుస్తోంది. సుమారు 5,000 కోట్ల రూపాయల వరకు చేతులు మారినట్టు సమాచారం. ఆప్ విజయం సాధిస్తే రూపాయికి 70 పైసలు.. బీజేపీ గెలిస్తే రూపాయికి 85 పైసలు.. కాంగ్రెస్ గెలిస్తే రూపాయికి 5 రూపాయలు చొప్పున బెట్టింగ్ జరిగినట్టు తెలుస్తోంది.

ఢిల్లీ, చండీగఢ్, జైపూర్, అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో బుకీలు పెద్ద ఎత్తున ఆప్, బీజేపీలపై పందేలు కాసినట్లు సత్తా బజార్ గుసగుసలు వినిపిస్తున్నాయి. బెట్టింగ్ మార్కెట్ అంచనాల ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ ఎన్నికల్లో 54 నుంచి 56 స్థానాలు లభించే అవకాశం ఉంది. బీజేపీకి 11 నుంచి 13 స్థానాలు దక్కవచ్చునని వీరు అంచనా వేశారు. కాంగ్రెస్‌కు 3 నుంచి 4 స్థానాలు లభించవచ్చునని భావిస్తున్నారు.



Next Story

Most Viewed