అమెజాన్‌ ప్రైమ్‌లో మన భాషలో ఉన్న షోలు

by  |
అమెజాన్‌ ప్రైమ్‌లో మన భాషలో ఉన్న షోలు
X

ఎన్ని స్ట్రీమింగ్ సర్వీసులు ఉన్నా… ఇంగ్లీషు, హిందీ ప్రోగ్రామ్‌లు, సినిమాలతో పోలిస్తే వాటిలో ఉన్న తెలుగు కంటెంట్ చాలా తక్కువ. అయితే డైరెక్టు తెలుగు షోలు పెద్దగా లేకపోయిన అమెజాన్ ప్రైమ్ వారు మాత్రం కొన్ని పాపులర్ హిందీ షోలను తెలుగు ఆడియోతో అందిస్తున్నారు. ఆ కార్యక్రమాల వివరాలు మీకోసం…

1. బ్రీత్

అవయవదానం చేయాలనుకున్న కొంతమంది ఒక్కొక్కరుగా హత్యకు గురవుతుంటారు. వారి కేసులను చేధించడానికి క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ కబీర్‌ నియమితుడవుతాడు. ఈ విచారణలో భాగంగా హంతకుడి గురించి కబీర్ కొన్ని భయంకర నిజాలు తెలుసుకుంటాడు. ఒక సాధారణ వ్యక్తికి అసాధారణ పరిస్థితులు ఎదురైనపుడు అతనెలా స్పందిస్తాడో బ్రీత్ చూస్తే తెలిసిపోతుంది. మాధవన్ నటన ఇందులో ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది. థ్రిల్లర్ షోలు నచ్చేవారు తప్పకుండా చూడాల్సిన సిరీస్ ఇది. త్వరలో ఈ షో రెండో సీజన్ కూడా విడుదలకాబోతోంది.

2. ద ఫర్‌గాటెన్ ఆర్మీ – ఆజాదీ కే లియే

బ్రిటిష్ వారి చెర నుంచి భారతీయులను విడిపించడానికి సింగపూర్ నుంచి ఢిల్లీ వరకు 3,885 కి.మీ.లు ప్రయాణించిన ఆజాద్ హింద్ ఫౌజ్ కథ ఇది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ సారథ్యంలో తమ కంటే పెద్ద సైన్యం మీద వెనుదిరిగి చూడకుండా పోరాడినప్పటికీ వారి మీద నమ్మకద్రోహులు అని ముద్ర పడడం దురదృష్టకరం. దేశ చరిత్రలో మరుపు గురైన ఈ ఆర్మీ కథను అద్భుతమైన యాక్షన్‌తో ఆనాటి పరిస్థితులను కళ్ల ముందు కదలాడుతున్నట్లు ఈ షోలో చూడొచ్చు. కేవలం ఐదు ఎపిసోడ్లు మాత్రమే ఉండే ఈ సీరియల్ యుద్ధ ఇతివృత్తం కథలను ఇష్టంగా చూసేవారికి బాగా నచ్చుతుంది.

3. ఇన్‌సైడ్ ఎడ్జ్

ఐపీఎల్ లాంటి క్రికెట్ మ్యాచులకు భారతదేశంలో ఉండే క్రేజు అంతా ఇంతా కాదు. అయితే అలాంటి క్రికెట్ మ్యాచుల వెనకాల జరిగే రాజకీయాలు, ఎత్తుకు పైఎత్తులు ఇన్‌సైడ్ ఎడ్జ్ సిరీస్‌ చూస్తే అర్థమవుతాయి. పైకి ఒక విధంగా లోపల మరొక విధంగా ప్రవర్తించే పాత్రలు, అవసరాల కోసం అడ్డదారులు తొక్కే వేషగాళ్లు, కులపిచ్చిగాళ్లు ఇంకా మైదానంలో ఆహ్లాదాన్ని పంచే ఆట వెనక ఉన్న ఆటంకాలు, ఆటగాళ్ల ఇబ్బందులు ఈ సిరీస్‌‌లో బాగా చూపించారు. మొదటి ఎపిసోడ్ మొదలు పెట్టగానే రెండో ఎపిసోడ్… అలా అలా రెండు సీజన్లు పూర్తిచేసే వరకు వదలబుద్ధి కాదు. ముఖ్యంగా క్రికెట్ పిచ్చి ఉన్నవాళ్లకు ఈ సిరీస్ బాగా నచ్చుతుంది.

4. ద ఫ్యామిలీ మ్యాన్

తక్కువ జీతం, ఎక్కువ పని.. పైగా కొన్నిసార్లు ప్రాణాలు కూడా పణంగా పెట్టాలి. ఇంకా చెప్పాలంటే అసలు ఉద్యోగమేంటో కూడా ఎవరికీ చెప్పొద్దు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో పనిచేసే శ్రీకాంత్ తివారీ పరిస్థితి ఇది. కానీ ఇంట్లో ఒక భార్య, ఇద్దరు పిల్లలు, మంచి ఉద్యోగం చేయమని పోరుపెట్టే బంధువులు. ఓ వైపు దేశంలో జరగబోయే తీవ్రవాద దాడులను ఆపే పని, మరోవైపు కుటుంబాన్ని చక్కదిద్దుకునే పని. ఈ రెండింటి మధ్య సతమతమయ్యే ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌ను యాక్షన్, డ్రామాను అతిగా ఇష్టపడే వాళ్లు తప్పకుండా చూసి తీరాలి.

ఇవి మాత్రమే కాకుండా లాఖోన్ మే ఏక్, మేడిన్ హెవెన్, ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్, మీర్జాపూర్ వంటి హిందీ సిరీస్‌లు కూడా తెలుగు ఆడియోలో అందుబాటులో ఉన్నాయి. లిప్ సింక్ కొద్దిగా ఇబ్బందులు కలిగించినట్లు అనిపించినా కథాకథనాలతో ప్రేక్షకుడిని ఈ సిరీస్‌లు కట్టిపడేస్తాయి.

tags: Amazon Prime, Series, Hindi, Available in Telugu, The Family Man, The Forgotten Army, Mirzapur, Inside Edge



Next Story

Most Viewed