ప్రముఖ బెంగాలీ రచయిత బుద్ధాదేవ్ గుహా కన్నుమూత

by  |
buddhadeb guha
X

కోల్‌కతా: ప్రముఖ బెంగాలీ రచయిత బుద్ధాదేవ్ గుహా(85) మరణించారు. అనారోగ్య కారణాలతో కోల్‌కతాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన, ఆదివారం అర్ధరాత్రి గుండెపోటుతో మరణించారు. ‘బుద్ధాదేవ్ ఇక లేరు. కృష్ణాష్టమి రోజున భగవంతుని సన్నిధికి చేరారు’ అంటూ పెద్దకూతురు మాలని ట్వీట్ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆయనకు కరోనా సోకగా, దాదాపు 33 రోజుల తర్వాత కోలుకున్నారు. కాగా, తాజాగా ఊపిరితిత్తులు, కిడ్నీ సమస్యలతో మరోసారి ఆసుపత్రిలో చేరిన ఆయన కన్నుమూశారు.

వృత్తిరీత్యా చార్టెర్డ్ అకౌంటెంట్ అయిన గుహా, పిల్లల నవల రచయితగా పేరుపొందారు. ఈయన సృష్టించిన రిజుడా, రుద్ర పాత్రలు చాలా ప్రచారం పొందాయి. ముఖ్యంగా ప్రకృతి, అడవుల గురించి ప్రస్తావన తన రచనల్లో ఎక్కువగా ఉండేవి. ఈయన రాసిన ‘మధుకోరి’ నవల బెంగాలీ సాహిత్యానికి ఒక మైలురాలుగా నిలిచింది. ఈయన మృతిపై గవర్నర్ జగ్‌దీప్ ధన్‌కర్, సీఎం మమతా బెనర్జీ విచారం వ్యక్తం చేశారు.

ప్రధాని విచారం..

గుహా మృతిపై ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. గుహా రచనలు బహుముఖంగా ఉండడంతో పర్యావరణ సున్నితత్వాన్ని ప్రదర్శించాయని అన్నారు. అన్ని తరాలను ఆయన రచనలు అలరించాయని పేర్కొన్నారు.

Next Story

Most Viewed