బీసీ బంధు ఇవ్వాల్సిందే.. ప్రభుత్వానికి ఆర్.కృష్ణయ్య హెచ్చరిక

by  |
BC community leader R.Krishnaiah
X

దిశ, కొడంగల్: దళితబంధు మాదిరి బీసీ బంధు కూడా రాష్ట్రంలో అమలు చేయాలని లేకపోతే, పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య హెచ్చరించారు. గురువారం కొడంగల్‌ పట్టణంలో ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన కృష్ణయ్య, అక్కడ మీడియాతో మాట్లాడుతూ… దళితులకు రూ.10 లక్షల రూపాయలు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. బీసీబంధు పథకం పెట్టి ప్రతీ బీసీ కుటుంబానికి రూ.10 లక్షల అందించాలన్నారు. బీసీలలో అత్యంత వెనుకబడిన కులాలు ఉన్నాయని తెలిపారు. బీసీబంధు పెట్టడంతో గొప్ప నాయకుడిగా కేసీఆర్ చరిత్రలో నిలుస్తారన్నారని అన్నారు. అంతేగాకుండా.. దళిత బంధును హుజురాబాద్‌కు మాత్రమే పరిమితం కాకుండా రాష్ట్రంలో అన్ని జిల్లాలకు వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. గత ఏడేండ్లుగా బీసీ కార్పొరేషన్ నుంచి గాని, కుల ఫెడరేషన్ నుంచి కానీ ఎలాంటి రుణాలు రాలేదన్నారు. ఐదు లక్షల 77 వేల దరఖాస్తులు చేసుకున్నారని గుర్తుచేశారు. ఒక్కొక్కరూ ఒక లక్ష నుంచి యాభై లక్షల వరకు సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో అత్యధికంగా బీసీలే ఉన్నారని తెలిపారు. బీసీల వాటా బీసీలకు దక్కితే ప్రభుత్వానికి ఆ గౌరవం దక్కుతుందని సూచించారు.

బీసీబంధు అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేసి సాధించుకుంటామని హెచ్చరించారు. కల్యాణ లక్ష్మి కూడా మొట్టమొదటగా దళితులకు, మైనార్టీలకు మాత్రమే ఇచ్చారని, అసెంబ్లీలో పోరాటం చేసి, ఇందిరాపార్కు వద్ద వేలాదిమందితో ధర్నా చేయడంతో కళ్యాణ లక్ష్మి బీసీలకు కూడా వర్తింపజేశారని గుర్తుచేశారు. ప్రతీ బీసీ కుటుంబానికి రూ. 10 లక్షలు ఇవ్వడం ప్రభుత్వానికి చాలా సులభం అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 40 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో అత్యంత ధనిక రాష్ట్రంగా ఏర్పాటు అయిందన్నారు. బీసీలు అందరూ ఐకమత్యంగా ఉండి రాజ్యాధికారం కోసం పోరుబాట పట్టాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి 50 శాతం రిజర్వేషన్లు కల్పించే వరకూ విశ్రాంతి తీసుకోవద్దన్నారు. 52 శాతం ఉన్న బీసీలు ముఖ్యమంత్రి కాలేదని, ఇది ప్రజాస్వామ్యానికి తలవంపు అన్నారు. తిరుగుబాటు చేసి మన వాటా మనం దక్కించుకోవాలి అని అభిప్రాయపడ్డారు. చట్టసభల్లో అఖిలపక్షంతో బీసీ బిల్లుకు కేంద్రంపై టీఆర్ఎస్ ప్రభుత్వం ఒత్తిడి తేవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను అనిచివేతకు గురి చేస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు రవీంద్ర చారి, అడ్వకేట్ వెంకటయ్య, భీమ్ రాజు, లాల్ కృష్ణ, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed