ఒకే ఏడాదిలో 12 పంటలు.. సాధ్యమే!

by  |

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కురిసిన వర్షాల కారణంగా అటు పెసలు దక్కలేదు, ఇటు పత్తి కూడా దక్కే స్థితిలో లేదు. దీంతో రైతులందరూ మిర్చి మీదనే ఆశలు పెట్టుకున్నారు. దురదృష్టం వల్ల ఈ పంటకు కూడా ఏదైనా అయిందంటే ఈ ఏడాదికి పస్తులు ఉండాల్సిందేనని కంగారు పడుతున్నారు. ఇలా ఏడాది పాటు ఎలాంటి ఆదాయం, ఆసరా లేకుండా నష్టపోవడం నుంచి తప్పించుకోవడానికి రైతులు 70 దశకంలో పాటించిన విధానాలను అనుసరిస్తే సరిపోతుంది. మరి ఆ విధానాలు ఇప్పటి రైతులకు తెలియాలంటే ఎలా? అందుకే ఎప్పటికైనా ఆ పాత పద్ధతులు ఉపయోగపడతాయని తెలిసి, ఓ సామాజికవాది తన విప్లవంతో వాటికి ప్రాణం పోస్తున్నాడు. ఇంతకీ ఆ సామాజికవాది ఎవరు? ఆయన చేస్తున్న విప్లవం ఏంటి?

ఆ సామాజికవాది పేరు విజయ్ జర్దారీ, ఈయన స్థాపించిన విప్లవం పేరు బీజ్ బచావో ఆందోళన్. ఒకే ఏడాదిలో పన్నెండు పంటలను పండించి, ఒకటి రెండు పంటలు నష్టపోయినా మిగతా పంటల నుంచి రైతులు ఎలా లాభపడవచ్చునని విజయ్ జర్దారీ గత ముప్పై ఏళ్లుగా ప్రచారం చేస్తున్నారు. ఈ విప్లవంలో భాగంగా క్రిమిసంహారకాలను తట్టుకుని నిలబడిగలిగే విత్తనాలను ఇంటింటికీ తిరిగి ఆయన సేకరించారు. ఇప్పటివరకు 350 రకాల విత్తనాలను ఆయన సేకరించగలిగారు. అలాగే క్రిమిసంహారకాలు ఉపయోగించకుండా, ఎక్కువ ఖర్చు లేకుండా, ఎక్కువ నష్టపోకుండా ఉండే వ్యవసాయ విధానం గురించి కూడా ఆయన ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్నారు. 1980ల కాలంలో అంతరించిపోయిన ఈ విధానానికి ఆయన మళ్లీ ప్రాణం పోస్తున్నారు. వాణిజ్య పంటల మాయలో పడి క్రిమిసంహారకాలు ఉపయోగించి, ప్రతి ఏడాది ఒకే రకమైన పంటను వేస్తూ నేల సారాన్ని క్షీణింపజేసే ఆధునిక వ్యవసాయాన్ని ఈయన వ్యతిరేకిస్తారు. అందుకు బదులుగా బారానాజ్ వ్యవసాయ విధానాన్ని ఉపయోగించాలని ఆయన ప్రోత్సహిస్తారు.

బారానాజ్… అంటే పన్నెండు పంటలు. అంటే ఒక ఏడాదిలో ఒక పంట భూమిలో పన్నెండు రకాల పంటలు పండించుకునే విధానం. ఇప్పుడు కొందరు రైతులు పాటిస్తున్న అంతర పంటల విధానానికే కొంత శాస్త్రీయ విజ్ఞానాన్ని జోడించి ఈ బారానాజ్ విధానాన్ని రూపొందించారు. ఈ పన్నెండు పంటలు ఒకదానితో ఒకటి వనరులను సమన్వయం చేసుకుంటూ బతుకుతాయన్న మాట. ఇలా వేయడం వల్ల ఒక పంట నుంచి మరో పంటకు పోషకాలు అందడంతో పాటు కీటకాల నుంచి కూడా రక్షణ లభిస్తుంది. అంతేకాకుండా ఒకే భూమిలో ఇలా వైవిధ్యమైన పంటలు పండించడం ద్వారా ఆ భూమి సారం కూడా పెరుగుతుంది. దీనికి ఏదైనా నిర్ధిష్ట విధానం ఉందా అని అడిగితే.. అలాంటిదేమీ లేదని విజయ్ జవాబిచ్చారు. కాకపోతే ఆ పంటల్లో చిరుధాన్యాలు, మసాలా దినుసులు, కూరగాయలు, తృణధాన్యాలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలని ఆయన సలహా ఇచ్చారు.

బారానాజ్ అనేది జీరో బడ్జెట్ వ్యవసాయం కాబట్టి రైతులు ఇందులో కోల్పోవాల్సింది ఏముండదు. అంతేకాకుండా ఇది ఒక అడవి మాదిరిగా దానంతట అదే పెరిగే విధానం. అంటే అడవిలో చెట్లను ప్రత్యేకంగా రక్షించాల్సిన అవసరం లేదు. వాటంతట అవే తమ చుట్టుపక్కల ఉన్న చెట్లతో సమన్వయం చేసుకుని పెరుగుతాయి. సరిగ్గా అలాగే ఈ బారానాజ్ విధానంలో ఒక పంట, మరొక పంట మీద ఆధారపడి ఎదుగుతుంది. పైగా క్రిమిసంహరక మందుల ఖర్చు కూడా తగ్గుతుంది. అలాగే ఒకవేళ అధిక వర్షాలు, పీడలు, వ్యాధుల వల్ల ఏదైనా ఒక పంట నష్టపోతే మిగతా పంటల నుంచి లాభం పొందవచ్చు. కాబట్టి ఏ రకంగా చూసినా ఈ విధానంలో రైతు నష్టపోవాల్సిన అవసరం ఉండకపోగా, అటు పర్యావరణాన్ని, ఇటు జీవవైవిధ్యాన్ని, భూసారాన్ని కాపాడినట్లు అవుతుందనంటూ విజయ్ జర్దారీ ముగించారు.

Next Story

Most Viewed