వరుసగా రెండోరోజూ నష్టపోయిన సూచీలు

by  |
వరుసగా రెండోరోజూ నష్టపోయిన సూచీలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండోరోజూ నష్టాలను ఎదుర్కొన్నాయి. బుధవారం నాటి ట్రేడింగ్‌లో తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్న సూచీలు బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఆటో రంగాల్లో షేర్ల పతనం కారణంగా దెబ్బతిన్నాయి. చివరి గంటలో కోలుకుంటున్న సంకేతాలు కనిపించినప్పటికీ నష్టాల నుంచి బయటపడలేకపోయాయి. అంతేకాకుండా అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, చైనా ప్రభావంతో ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ర్యాలీ చేయడంతో స్టాక్ మార్కెట్లలో మదుపర్లు కొంత అప్రమత్తంగా వ్యవహరించారు. వీటితోపాటు గత కొన్ని సెషన్లుగా రికార్డు గరిష్ఠాల వద్ద సూచీలు ర్యాలీ చేస్తుండటంతో కీలక రంగాలు దిద్దుబాటు చర్యను ఎదుర్కొన్నాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 254.33 పాయింట్లను పతనమై 59,413 వద్ద క్లోజయింది. నిఫ్టీ 37.30 పాయింట్లను కోల్పోయి 17,711 వద్ద ముగిసింది. నిఫ్టీలో ప్రైవేట్ బ్యాంక్, ఎఫ్ఎంసీజీ, ఫైనాన్స్, ఆటో, బ్యాంకింగ్ రంగాలు పతనమయ్యాయి.

మెటల్, పీఎస్‌యూ బ్యాంక్, రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా, హెల్త్‌కేర్ రంగాలు పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్, సన్‌ఫార్మా, ఎస్‌బీఐ, టైటాన్, టాటా స్టీల్, డా రెడ్డీస్ షేర్లు లాభాలను దక్కించుకోగా, హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్ బ్యాంక్, ఏషియన్ పెయింట్, ఆల్ట్రా సిమెంట్, హిందూస్తాన్ యూనిలీవర్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.16 వద్ద ఉంది.


Next Story