బండి‌ సంజయ్ పాదయాత్ర వాయిదా

by  |
Bandi Sanjay
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ఈనెల 9 నుంచి ప్రారంభం కావల్సి ఉండగా పార్లమెంట్ సమావేశాలతో వాయిదా వేసినట్లు బీజేపీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్ది వెల్లడించారు. హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పాదయాత్రలో మార్పులు చేశామని, ఈ నెల 24 నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. భాగ్యలక్ష్మి ఆలయం నుంచే పాదయాత్రను బండి సంజయ్ ప్రారంభిస్తారన్నారు. కేంద్రమంత్రి పదవి కిషన్ రెడ్డికే కాదని తెలంగాణ సమాజానికి బీజేపీ ఇచ్చిన గౌరవం అన్నారు. ఈనెల 16, 17, 18 తేదీల్లో కిషన్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తారని వెల్లడించారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆరోగ్యం కుదుట పడిన తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎక్కడైతే పాదయాత్ర ఆగిందో అక్కడి నుంచి తిరిగి ప్రారంభిస్తారని తెలిపారు.

రాజకీయ పబ్బం కోసమే…

రాజకీయ పబ్బం గడుపుకునేందుకే ఇద్దరు సీఎంల జలజగడం అని బీజేపీ జాతీయ ఓబీసీ అధ్యక్షుడు లక్ష్మణ్ దుయ్యబట్టారు. నీటి సమస్య పరిష్కారంపై సీఎం కేసీఆర్ కు చిత్తశుద్ధి లేదన్నారు. సీఎం కేసీఆర్ కేంద్రంపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కేంద్రం ఇచ్చిన నిధులను కేసీఆర్ ప్రభుత్వం దారి మళ్లిస్తోందని ఆరోపించారు. ఖర్చు చేయకపోవడంతో నిధులు తిరిగి వెళ్తున్నాయని, దానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్నారు. కేంద్ర పథకాల అమలుకు టీఆర్ఎస్ సర్కార్ సహకరించటం లేదని, తెలంగాణ పల్లెలకు వచ్చే ప్రతి‌ రూపాయి కేంద్రం నిధులే అన్నారు. హైదరాబాద్ ప్రజలు కట్టే పన్నులు పాలకులు దోచుకుంటున్నారని మండి పడ్డారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులకు ప్రతి నెల రూ.30కోట్లు వడ్డీలు కడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వాన్ని పేదల ప్రభుత్వంగా అభివర్ణించారు. వైద్యవిద్యలో ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు చేయటమే ఇందుకు నిదర్శనమని, ప్రధాని మోదీ నిర్ణయంతో వెనుకబడిన వర్గాల ఆత్మవిశ్వాసం పెరిగిందని, కుటుంబ ప్రయోజనాల కోసమే ప్రాంతీయ పార్టీలు పనిచేస్తున్నాయని దుయ్యబట్టారు. కులాలు, మతాల పేరుతో ఓట్లు దండుకోవటమే ప్రాంతీయ పార్టీల లక్ష్యమని ఎద్దేవా చేశారు. సమావేశంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed