టీఆర్ఎస్‌లో మంత్రి పదవి కావాలంటే.. కేసీఆర్‌కు మందు కలపాలి : బండి సంజయ్

by  |
bandi sanjay
X

దిశ, తెలంగాణ బ్యూరో : ‘ రైతులు దిక్కులేక కల్లాలు, రోడ్లపై, మార్కెట్ల వద్ద ధాన్యం పెట్టుకొని అమ్ముకోలేక ఒకవైపు.. వర్షాలు పడుతాయని ఆందోళనలో మరోవైపు ఉంటే సమస్యను పరిష్కరించకుండా అధికారంలో ఉండి టీఆరేసోళ్లు సిగ్గులేకుండా ధర్నాలు చేస్తున్నారు’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలోనే దీక్ష చేయలేదు. ఇప్పుడేం ధర్నా లు చేస్తడు అని ప్రశ్నించారు. టైం వేస్ట్ కాదు.. టైం పాస్ ధర్నాలు చేస్తడు కేసీఆర్ అని మండిపడ్డారు. కేసీఆర్ కు కూడా ఈడీ భయం పట్టుకుందని, సానుభూతి కోసమే ప్రెస్ మీట్లు పెడుతున్నాడని ఆరోపించారు.

టీఆర్ఎస్ మంత్రులు అడిగిన అన్నింటికీ సమాధానం చెప్పానని.. కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వానాకాలం పంటను పూర్తిస్థాయిలో కొంటరా? కొనరా? అనేదానిపై కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. రైతులు తమ సమస్యలపై ధర్నాలు చేస్తున్నారా.. కావాలని అపోహలు, భ్రమలు సృష్టించేందుకు టీఆర్ఎస్ తాపత్రాయం పడుతుందన్నారు. అంతర్జాతీయ సమస్యలపై ధర్నా చేశారా? దేనిపై ధర్నాలు చేశారో టీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలన్నారు. వానాకాలం తరువాత పంటలు వేసే ముందు సర్వే చేసి కేంద్ర ప్రభుత్వం రిపోర్ట్ ఇస్తదని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో పంటనే వేయలేదు.. కేంద్రం ఏమని లేఖ రాస్తుంది? అని ప్రశ్నించారు. పంటల మార్పిడికి బీజేపీ వ్యతిరేకం కాదని, ముందస్తుగా రైతులకు అవగాహన కల్పించి .. పంటమార్పిడి చేయాలని డిమాండ్ చేశారు. ఓటేసే సమయంలో రైతులు అని గుర్తు చేసుకుంటారని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ చేపట్టిన ధర్నా కు వచ్చిన వారే కేసీఆర్ డౌన్ డౌన్ అంటున్నారు. వాళ్లకు వాస్తవ విషయాలు తెలియనట్టు ఉన్నాయన్నారు. టీఆర్ఎస్ పార్టీ లో మంత్రి పదవులు కావాలనుకున్న వారు మందు కలుపుతరు.. నాకేం అవసరం? అన్నారు. ఈ విషయం తెలిస్తే టీఆర్ఎస్ ఎమ్మెల్యే లు మందు పోసేందుకు క్యూ కడతారని ఎద్దేవా చేశారు.

బండి​ యాత్రకు బ్రేక్ ?

బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర కు బ్రేక్ పడింది. రెండో విడుత ప్రజా సంగ్రామ యాత్రను ఈ నెల 21 నుంచి చేపట్టాలని బీజేపీ శ్రేణులు నిర్ణయించాయి. అయితే రాష్ట్రంలో ఈ నెల 9 నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. యాత్ర అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటే నిబంధనలతో కూడిన అనుమతి ఇచ్చారు. అయితే అనుకున్న స్థాయిలో యాత్రను నిర్వహించలేమని భావించి యాత్రను వాయిదా వేసేందుకు బీజేపీ నేతలు భావిస్తున్నారు.


Next Story

Most Viewed