రామ్‌లల్లా ఆగయా.. రామమందిరంలోకి అయోధ్య రామయ్య

by Dishanational4 |
రామ్‌లల్లా ఆగయా.. రామమందిరంలోకి అయోధ్య  రామయ్య
X

దిశ, నేషనల్ బ్యూరో : అయోధ్య రామమందిరం గర్భగుడిలో ప్రతిష్ఠించనున్న ‘రామ్‌ లల్లా’ విగ్రహమూర్తి ఎట్టకేలకు బుధవారం రాత్రి ఆలయ ప్రాంగణానికి చేరుకుంది. 51 అంగుళాల ఎత్తైన బాలరాముడి విగ్రహం ప్రత్యేక ట్రక్కులో ఆలయంలోకి ప్రవేశించగానే భక్తులంతా ‘జై శ్రీరామ్’ నినాదాలతో హోరెత్తించారు. దీంతో ఒక్కసారిగా ఆలయం పరిసరాలు ‘జై శ్రీరామ్’ నినాదాలతో మార్మోగాయి. గురువారం రోజు ఆలయం గర్భగుడిలో బాలరాముడికి శాస్త్రోక్తంగా సరయూ నదీజలాలతో పవిత్ర స్నానాలు, పూజాదికాలను నిర్వహిస్తారు. ఈనెల 21 వరకూ రామ్‌లల్లాకు ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఈ మొత్తం కార్యక్రమాలను 121 మంది అర్చకులు నిర్వహించనున్నారు. పూజలకు సంబంధించిన విధివిధానాలను జ్ఞానేశ్వర్ శాస్త్రి నిర్దేశిస్తూ సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. కాశీకి చెందిన లక్ష్మీకాంత్ దీక్షిత్ ప్రధాన ఆచార్యులుగా ఉంటారు. అనంతరం 22వ తేదీన మధ్యాహ్నం 12.30 గంటలకు గర్భగుడిలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరుగుతుంది.

రామ మందిర నిర్మాణం పూర్తయింది : నృపేంద్ర మిశ్రా

రామమందిర నిర్మాణం పూర్తికాకముందే శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ చేస్తుండటంపై పలువురు హిందూమత పండితులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న తరుణంలో అయోధ్య రామాలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా స్పందించారు. రామ్‌లల్లా ఆలయ నిర్మాణం పూర్తయిందని ప్రకటించారు. శ్రీరాముడు కొలువు తీరాల్సిన గర్భగుడి గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ఉందని.. దాని నిర్మాణ పనులన్నీ ఇప్పటికే కంప్లీట్ అయ్యాయని స్పష్టం చేశారు. రామయ్య ఉండబోయే గర్భగుడిలోని ఫ్లోర్‌లో ఐదు మండపాలు ఉంటాయన్నారు. ఇంకా నిర్మాణ దశలో ఉన్న మొదటి అంతస్తులో రామ్ దర్బార్ ఉంటుందని తెలిపారు. రెండో అంతస్తు అనేది కేవలం ప్రత్యేక యాగాలు, అనుష్ఠానాలు చేసేందుకు సంబంధించినదని చెప్పారు.

Next Story

Most Viewed