టీఎస్ఆర్టీసీ బస్సులను అమ్మేద్దాం..!

by  |
టీఎస్ఆర్టీసీ బస్సులను అమ్మేద్దాం..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: మహా వృక్షాన్ని నేలకూల్చేందుకు కూకటివేళ్లను నరికే ప్రయత్నాలు ఆర్టీసీలో మొదలవుతున్నాయి. కొత్త బస్సులను కొనుగోలు చేసే సామర్థ్యం లేని ఆర్టీసీ.. పాత బస్సులను ఇనుప సామానుకు అమ్మేందుకు సిద్ధమైంది. దీంతో ప్రైవేట్ బస్సులకు రాచమార్గం వేస్తోంది. ఫలితంగా మెల్లమెల్లగా ఆర్టీసీని ప్రైవేట్​పరం చేసేందుకు మార్గాలు పడుతున్నాయి. ముందుగా పాత బస్సులను అక్కరకు రాకుండా విక్రయించి వాటి స్థానంలో తప్పని పరిస్థితి అంటూ ప్రైవేట్ బస్సులకు స్థానం కల్పించనున్నారు. దీంతో ప్రైవేట్​ఆధిపత్యం మొదలై సంస్థను నామరూపాలు లేకుండా చేసే ప్రయత్నాలు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

ఆర్టీసీలో పాతబడిన ఆర్టీసీ బస్సులను విక్రయించాలని అధికారులు నిర్ణయించారు. ముందుగా వీటిని ప్రైవేటు సంస్థలకు కాకుండా మునిసిపాలిటీలకు విక్రయించి ఎంతో కొంత నిధులను సమకూర్చుకోవాలని భావించారు. మునిసిపాలిటీల్లో ఏర్పాటు చేయనున్న మొబైల్‌ షీ టాయిలెట్ల కోసం వీటిని విక్రయించాలనుకున్నారు. ఆర్టీసీలో 1,000 బస్సులు పాతబడిపోయాయి. మరో 300 బస్సులు వచ్చే ఏడాది మార్చిలో గడువు మీరనున్నాయి. వీటిలో 660 బస్సులను ఉద్యోగుల సమ్మె కాలంలోనే పక్కన పెట్టారు. ఇందులో గ్రేటర్ పరిధిలోనే అధికంగా ఉన్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ల పరిధిలో పూర్తిగా పాడై, దూర ప్రాంతాలకు నడవలేని బస్సులను మొత్తం పక్కన పెట్టారు. వీటిలో 12 ఏళ్ల లైఫ్‌ పిరియడ్‌ పూర్తయిన బస్సులు కూడా ఉన్నాయి.

ఇవన్నీ కొంత మేర కండిషన్‌లో ఉండగా… కొన్ని బస్సులను ఆర్టీసీ కార్గో సేవల కోసం కేటాయించారు. సరుకు రవాణాకు అనుకూలంగా ఉండేలా వీటి బాడీని మార్చారు. కండిషన్‌ను బట్టి దాదాపు 800 బస్సులను మునిసిపాలిటీలకు విక్రయించాలని భావించారు. జీహెచ్‌ఎంసీ, ఇతర మునిసిపాలిటీలు, ప్రధాన పట్టణాల్లో మొబైల్‌ షీ టాయిలెట్లను ఏర్పాటు చేయాలనుకున్నారు. బస్సు కండిషన్‌ను బట్టి ఒక్కో దానిని రూ.5 లక్షల వరకు విక్రయించేందుకు సిద్ధమయ్యారు. దీనిలో భాగంగా ఖమ్మం కార్పొరేషన్‌కు 8 బస్సులను, కోస్గి మునిసిపాలిటీకి ఒక బస్సును అమ్మారు. ఖమ్మం కార్పొరేషన్‌లో టాయిలెట్లకు అనుగుణంగా బస్సుల బాడీలను మార్పు చేయించింది. పాడుబడ్డ బస్సులను మూలన పడేసి స్క్రాప్‌గా మార్చే బదులు విక్రయిస్తే కనీసం కొంత నిధులైనా సమకూరుతాయన్నది ఆర్టీసీ భావించింది. కానీ.. తర్వాత పరిస్థితులు ఎందుకో మారాయి. మున్సిపాలిటీల్లో పాత బస్సుల కొనుగోళ్లు వద్దంటూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి కూడా ప్రోత్సాహం చూపించలేదు.

ఇక స్క్రాప్‌కే

ప్రస్తుతం బస్సులన్నీ తుప్పు పట్టుతున్నాయి. కండిషన్‌లో ఉన్నా వాటిని బయటకు తీసే పరిస్థితులు లేకపోవడం, మున్సిపాలిటీలకు అమ్మే నిర్ణయంలో వెనకాముందు ఆలోచిస్తుండటం, కొనుగోళ్లకు కూడా ముందుకు రాకపోవడం నేపథ్యంలో ఇక స్క్రాప్​ కింద ఇనుప సామాను దుకాణానికే పంపించనున్నారు. దాదాపు ముందుగా 800 బస్సులను ఇలా అమ్మేందుకు నిర్ణయం తీసుకున్నారు.

కొత్తగా ప్రైవేట్ బస్సులు

స్క్రాప్ కింద అమ్ముతున్న బస్సుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఎక్కువగా ఉన్నాయి. ఇక వాటి స్థానంలో కొత్తగా ప్రైవేట్ బస్సులను రంగంలోకి దింపేందుకు ప్లాన్ వేసినట్లు చెబుతున్నారు. పలు ప్రాంతాలకు బస్సులు తప్పనిసరిగా నడపాల్సి రావడంతో అక్కడ రవాణా ఇబ్బందులను సాకుగా చూపిస్తూ ప్రైవేట్ బస్సులను తిప్పనున్నారు. అయితే ముందుగా హైర్ పద్ధతిలో తీసుకుందామని అధికారులు అనుకున్నప్పటికీ… ప్రభుత్వం నుంచి బ్రేక్ పడినట్లు సమాచారం. పలు ప్రాంతాలను గుర్తించి ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించనున్నారు. లేనిపక్షంలో గ్రేటర్‌లో ముందుగా కొన్ని కిలోమీటర్లు ప్రాతిపదికన ఇచ్చి ప్రైవేట్ రవాణాకు ఇవ్వనున్నారు. దీంతో సదరు సంస్థ బస్సులను తిప్పుకునే అవకాశం ఉంటోంది.

కొత్త వాటికి పైసల్లేవ్​

వాస్తవానికి అమ్ముతున్న బస్సుల స్థానంలో కొత్త బస్సులను కొనుగోలు చేయాల్సి ఉంది. కానీ ప్రస్తుతం పీకల్లోతు అప్పుల్లో ఉన్న ఆర్టీసీ ఆ సాహసం చేయడం లేదు. అయితే ప్రభుత్వం నుంచి కూడా కొత్త వాటి కొనుగోలుకు సాయం రావడం లేదు. 2019లో కొత్త బస్సులకు రూ.140 కోట్లను అప్పుగా ఇచ్చింది. కానీ వాటితో పూర్తిగా కొనుగోలు చేయలేదు. దాదాపు రూ.70 కోట్లను ఆర్టీసీ అప్పులకు వడ్డీలు చెల్లించుకునేందుకే వాడుకుంది. అంతేకాకుండా ప్రభుత్వ వ్యవహారంతోనే ఆర్టీసీ అప్పుల్లో కూరుకుపోతుందనే అపవాదు కూడా ఉంది. 2019–20 వార్షిక లెక్కల ప్రకారం ఆర్టీసీకి రూ.3 వేల కోట్లు అప్పులున్నాయి. వీటిలో చాలా భూములను తనఖా కింద పెట్టాయి. రూ.850 కోట్లకు ప్రభుత్వం పూచీకత్తుగా ఉంది.

టికెట్ల అమ్మకాల ద్వారా ఆర్టీసీకి రోజుకు రూ.11 కోట్ల వరకు వస్తుంది. 2018-19 ఏడాదికి ఇది రూ.3,976 కోట్లు. ఇతర మార్గాల నుంచి అంటే షాపుల అద్దెలు, ప్రకటనలు, పార్శిళ్లు లాంటి వాటి నుంచి సుమారు రూ.వెయ్యి కోట్లు వస్తుంది. అన్నీ కలిపి 2018-19లో ఆర్టీసీ స్థూల ఆదాయం రూ.4,882 కోట్లుగా వెల్లడించారు. ఇక ఖర్చు సంగతికి వస్తే ఆదాయం కంటే ఏటా వెయ్యి కోట్ల రూపాయల వరకు అదనపు వ్యయం ఉంటుంది. ఆర్టీసీ ఖర్చులో ఎక్కువ భాగం జీతాలు, డీజిల్, పన్నులకే పోతుంది. ఆదాయ వ్యయాల మధ్య వ్యత్యాసం వల్ల ఆర్టీసీ ఏటా నష్టాల బారిన పడుతోంది.

2018-19లో ఆర్టీసీ స్థూల నష్టం రూ.928 కోట్లు. మరోవైపు ఆర్టీసీ అప్పులకు ఏటా ప్రభుత్వం రూ.250 కోట్ల వరకు వడ్డీలు కడుతోందని ప్రభుత్వం గతేడాది సమ్మె సమయంలో వెల్లడించింది. 2013లో పెంచిన 44 శాతం ఫిట్‌మెంట్ భారం ఏడాదికి రూ.900 కోట్లు, 2018 జూన్‌లో ప్రకటించిన 16 శాతం మధ్యంతర భృతి భారం ప్రభుత్వమే భరిస్తోందని చెప్పుకుంది. మిగతా రాష్ట్రాల కంటే ఇక్కడ ఎక్కువ జీతాలూ, సౌకర్యాలూ ఉన్నాయని, 2014-19 మధ్య తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీకి దాదాపు రూ.4 వేల కోట్లు ఇచ్చిందని ప్రకటించారు. అయినా ఆర్టీసీ నష్టాల బాటను వీడలేకపోతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కొత్త బస్సుల కొనుగోళ్లకు రూపాయి ఇచ్చే పరిస్థితి లేదని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. దీంతో ఎంతైనా ఇక ప్రైవేట్ బస్సులే గత్యంతరంగా మారుస్తున్నారు.

ఇది కచ్చితంగా ప్రైవేట్‌కు అనుకూలమే

కాగా ఆర్టీసీలోని పాత బస్సులను స్క్రాప్​కింద అమ్మడం, కొత్త వాటిని కొనుగోలు చేసే సామర్థ్యం లేదని చెప్పడం ప్రైవేట్‌కు అప్పగించేందుకు సన్నాహాలేనని ఆర్టీసీ యూనియన్ నేతలు భావిస్తున్నారు. సమ్మె కాలంలో ఆర్టీసీ యూనియన్లు లేకుండా చేయడంలో సఫలమైన సీఎం.. ఇప్పుడు ఆదుకోవడంలో మాత్రం విఫలమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆర్టీసీ ఉద్యోగుల వేతనాలు ప్రతినెలా పదో తారీఖు తర్వాతనే ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ నుంచి కొత్త బస్సులు కొనడం అసాధ్యం. దీంతో ప్రైవేట్ బస్సులకు అవకాశం కల్పించేందుకు సిద్ధమైనట్లు చెబుతున్నారు. ఇలా బస్సులు, డిపోలను ప్రైవేట్‌కు అప్పగించి ఆస్తులు, భూములను సైతం అమ్ముతారని ఆరోపిస్తున్నారు.


Next Story

Most Viewed