ఇక నేను టెస్టులు ఆడటం కష్టమే : ఆరోన్ ఫించ్

by  |
ఇక నేను టెస్టులు ఆడటం కష్టమే : ఆరోన్ ఫించ్
X

దిశ, స్పోర్ట్స్ : తాను సాంప్రదాయ టెస్టు క్రికెట్ (Test cricket)ఆడటం ఇక కష్టమేనని, తన జీవితంలో టెస్టు క్రికెట్ ముగిసినట్లే అని ఆస్ట్రేలియా జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్ (Captain Aaron Finch) అన్నారు. మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ కోసం ఇంగ్లాండ్ వచ్చిన ఫించ్.. తన కెరీర్ ముగిసిపోయేలోపు కనీసం ఒక టెస్టు మ్యాచ్ అయినా ఆడాలని ఉందన్నాడు.

పరిమిత ఓవర్ల క్రికెట్‌కూడా ఎక్కువ కాలం ఆడలేనని, భారత్ వేదికగా 2023లో జరిగే వన్డే వరల్డ్ కప్ (ODI World Cup) తన అంతర్జాతీయ కెరీర్‌కు చివరి సిరీస్ అవుతుందని ఫించ్ స్పష్టం చేశాడు. క్రికెట్ ఆస్ట్రేలియా అధికారిక వెబ్‌సైట్‌ (Cricket Australia Official Website)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘నేనింకా రెడ్ బాల్ క్రికెట్ ఆడతానని చెబితే కచ్చితంగా అది అబద్దమే అవుతుంది. టెస్టు జట్టులో స్థానం సంపాదించడానికి ఇప్పుడు నేను ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడలేను. నేను ఆడే టాప్ ఆర్డర్ కోసం ఎంతో మంది యువకులు వెలుగులోకి వస్తున్నారు. ఇక నాకు చోటెక్కడ ఉంది’ అని ప్రశ్నించాడు. కాగా, ఫించ్ 2018 డిసెంబర్‌లో ఇండియాపై చివరి సారిగా టెస్టు మ్యాచ్ ఆడాడు. అతను ఇప్పటి వరకు కేవలం ఐదు టెస్టులే ఆడటం గమనార్హం. చివరి సారిగా ఒక టెస్టు మ్యాచ్ మాత్రం ఆడి సాంప్రదాయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతానని మాత్రం స్పష్టం చేశాడు.

Next Story

Most Viewed